రెండు రోజుల్లో భారీ వర్షం.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు..
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ గుంటూరు, కృష్ణ జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ గుంటూరు, కృష్ణ జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కాగా.. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది.
రాయలసీమలో పలుచోట్ల 43 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.