Two Committees On Vijayawada Fire Accident: రెండు కమిటీలతో విచారణ.. అనుమతులపై ఆరా

Two Committees On Vijayawada Fire Accident: కోవిద్ బాధితులున్న హోటల్ లో జరిగిన ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు రెండు కమిటీలను నియమించింది.

Update: 2020-08-10 00:49 GMT

Two Committees On Vijayawada Fire Accident: కోవిద్ బాధితులున్న హోటల్ లో జరిగిన ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు రెండు కమిటీలను నియమించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో హోటల్ కు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపై కమిటీలు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం బాదిత కుటుంబాలకు రూ. 50లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయగా, కేంద్రం రూ. 2 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

విజయవాడలోని రమేష్‌ హాస్పిటల్‌ అనుబంధ కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలను నియమించామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆస్పత్రికి అనుమతులు, ఇతర అంశాలపై విచారణకు ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌లతో ఒక కమిటీ, ప్రమాదానికి కారణాలపై ఇతర అధికారులతో మరో కమిటీని నియమించినట్లు చెప్పారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఈ రెండు కమిటీలను ఆదేశించామన్నారు. ఘటనా స్థలిని సందర్శించాక మంత్రులు.. మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, సంబంధిత అధికారులతో విజయవాడలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో నాని ఆదివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే..

► రమేష్‌ ఆస్పత్రికి అనుబంధంగా హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని అగ్నిమాపక శాఖ సిబ్బంది కాపాడారు.

► ఆస్పత్రి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించాం. ఆస్పత్రిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశాం.

► రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రులపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం.

► ఘటనకు కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు మేకతోటి సుచరిత, వెలంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

అనుమతులపై ఆరా

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్‌ ఆస్పత్రి ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ కోవిడ్‌ కేంద్రానికి ఏ విధమైన అగ్నిమాపక అనుమతుల్లేవు. హోటల్‌గా వినియో గిస్తున్నట్లయితే 15 మీటర్ల ఎత్తుకు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) అనుమతులు తీసుకోవాలి. అదే కోవిడ్‌ సెంటర్‌కు కనీసం 9 మీటర్ల ఎత్తుకు అనుమతులు పొందాలి. కానీ, ఈ రెండు అనుమతుల్లేవని సమాచారం.

కోవిడ్‌ సెంటర్‌కు ఉండాల్సిన సౌకర్యాలు..

► కోవిడ్‌ సెంటర్‌ కానీ ఆస్పత్రి కాని నిర్వహించాలంటే రోగులను అత్యవసర పరిస్థితుల్లో స్ట్రెచ్చర్‌పై తరలించేందుకు వీలుగా ర్యాంపు ఉండాలి.

► అగ్నిప్రమాదం జరిగితే మంటలను వెంటనే అదుపుచేసేందుకు ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేసుకోవాలి.

► మూడు చదరపు మీటర్లు దూరం వరకు నీటిని చిమ్మే స్ప్రింక్లర్లు ఉండాలి.

► ప్రమాదం జరిగిన వెంటనే నీరు వచ్చేందుకు ఆటోమేటిక్‌ డిటెక్టరు, పై అంతస్తుల్లో ఉన్న రోగులను అప్రమత్తం చేసేందుకు సేఫ్టీ అలారం ఉండాలి.

► ముఖ్యంగా భవనంపై వాటర్‌ ట్యాంకును నిర్మించాలి. ఇవేమీ ఈ హోటల్‌లో లేవు.

► ఆ హోటల్‌లో కరోనా కేర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదు.

చెక్కతో చేసిన అలంకరణతో..

కాగా, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రిసెప్షన్‌ ఉంది. దాని పక్కనే మెట్లు, లిఫ్ట్‌ ఉంది. రిసెప్షన్‌ నుంచే అన్ని గదులకు కేబుల్స్‌ ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌వల్ల కేబుల్స్‌లో అంతర్గతంగా (మౌల్డింగ్‌లో ఇంటర్నల్‌ కంబర్షన్‌) మంటలు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. మంటలు బయటకు రాగానే ఆక్సిజన్‌తో కలిసి మంటలు ఒక్కసారిగా ఎగసిపడి ఉంటాయంటున్నారు. రిసెప్షన్‌ నుంచి రెండో అంతస్తు వరకు (డూప్లెక్స్‌ తరహాలో) అలంకరణకు చెక్కను బాగా వినియోగించడంవల్లే మంటలు తీవ్రంగా వ్యాప్తిచెందడానికి కారణమైంది.

Tags:    

Similar News