XXX Soap chairman: ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు వెల్లడించారు. తమిళనాడు నుంచి 1980లో గుంటూరు వచ్చిన మాణిక్యవేల్ సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. తాను తయారు చేసిన సబ్బులను రిక్షాలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి విక్రయించేశారు. అలా ఒక్కో మెట్టూ ఎక్కారు. ప్రకటనలకు ప్రాముఖ్యం ఉందని గుర్తించిన ఆయన బహుళ ప్రజాదరణ పొందిన సినిమా పాటల పల్లవులను ప్రచారానికి వాడారు. అందరికీ శుభం కలుగాక, సంస్కారవంతమైన సోప్ లాంటి నినాదాలు ఉపయోగించారు. గుంటూరులోని పలు సాంస్క్రుతిక, సేవా సంస్థలు, తమిళ సంఘాలకు చేయూతను అందించారు.