Tirumala: తిరుమలలో సరికొత్త రికార్డుల పర్వం.. 2025లో స్వామివారి వైభవం విశ్వవ్యాప్తం!

Tirumala: శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, ఆపదమొక్కులవాడు... ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా భక్తుల పాలిట కల్పవృక్షం ఆ మలయప్ప స్వామి.

Update: 2026-01-08 13:00 GMT

Tirumala: శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, ఆపదమొక్కులవాడు... ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా భక్తుల పాలిట కల్పవృక్షం ఆ మలయప్ప స్వామి. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రం నిత్యం గోవింద నామ స్మరణతో మారుమ్రోగుతోంది. 2025 సంవత్సరం తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డులకు వేదికైంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం విక్రయాలు, హుండీ ఆదాయం, భక్తుల రద్దీలో గత రికార్డులన్నీ చెరిగిపోయాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భక్తజనం పోటెత్తారు.

ఆనంద నిలయుని దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శిస్తే జన్మ ధన్యమౌతుందని కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే ఏటికేడు తిరుమల ఆదాయాన్ని, భక్తుల సంఖ్యను అమాంతం పెంచుతోంది. 2025లో స్వామివారి హుండీ ద్వారా 1,383 కోట్ల ఆదాయం లభించింది. ఇది 2024తో పోలిస్తే 18 కోట్లు అధికం. 2025లో ఏకంగా 2కోట్ల 61 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 6కోట్ల 30 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా, 99 లక్షల మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాలు తిరుమలలో భక్తి వెల్లువను సృష్టించాయి. పది రోజుల పాటు జరిగిన వైకుంఠ ద్వార దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు రికార్డు స్థాయిలో తరలివచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత క్రమశిక్షణతో, సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలనిచ్చాయి. ఈ పది రోజుల్లోనే దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య సరికొత్త మైలురాయిని చేరుకుంది.

తిరుమల శ్రీవారి లడ్డూ అంటే కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. అది ఒక అనుభూతి. 2025లో లడ్డూ విక్రయాలు కళ్ళు చెదిరే రీతిలో జరిగాయి. మొత్తం 13కోట్ల 52 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 27న ఒక్కరోజే 5లక్షల 13 వేల లడ్డూలు విక్రయించి పదేళ్ల రికార్డును తిరగరాశారు. లడ్డూ నాణ్యతపై భక్తులు అత్యంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే లడ్డూ రుచి అద్భుతంగా ఉందని... స్వచ్ఛమైన ఆవు నెయ్యి పరిమళం, యాలకులు, జీడిపప్పు కలయికతో లడ్డూ నాణ్యత పెరిగింది. ప్రసాదం విషయంలో రాజీ పడకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని భక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా ముడిసరుకుల నాణ్యతను పెంచడం, నెయ్యి కల్తీ జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల లడ్డూలకు పాత వైభవం వచ్చిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంకెల్లోనే కాదు.. భక్తుల నమ్మకంలోనూ తిరుమల తిరుగులేని క్షేత్రంగా నిలుస్తోంది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న చర్యలు, పారదర్శకమైన దర్శన ఏర్పాట్లు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News