BTech Ravi: జగన్ రాయలసీమ బిడ్డ కాదు... అభివృద్ధిని అడ్డుకునే క్యాన్సర్ గడ్డ

BTech Ravi: రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అసలైన విలన్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ నేత బీటెక్ రవి మండిపడ్డారు.

Update: 2026-01-09 09:57 GMT

BTech Ravi: జగన్ రాయలసీమ బిడ్డ కాదు... అభివృద్ధిని అడ్డుకునే క్యాన్సర్ గడ్డ

BTech Ravi: రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్న అసలైన విలన్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ నేత బీటెక్ రవి మండిపడ్డారు. జగన్ అసమర్థత, కమీషన్ల కక్కుర్తి వల్లే సీమలోని సాగునీరు ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ఆయన ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగడానికి జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రవి స్పష్టం చేశారు.

"తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్లే పనులు ఆగిపోయాయని అప్పట్లో హరీశ్ రావు చెప్పారు. అనుమతులు లేకుండా కమీషన్ల కోసం పనులు మొదలుపెట్టి, గ్రీన్ ట్రిబ్యూనల్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 2.60 కోట్ల జరిమానా పడేలా చేసింది జగన్ కాదా?" అని ప్రశ్నించారు. పోలవరం, మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టులను ఎందుకు ఆపలేకపోయారని, కేవలం జగన్ ఫ్రెండ్లీగా ఉన్న సమయంలోనే సీమ ప్రాజెక్టులు ఎలా ఆగిపోయాయని ఆయన నిలదీశారు.

సీమ అభివృద్ధి టీడీపీ పుణ్యమే:

రాయలసీమలోని బృహత్తర ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే జరిగాయని రవి గుర్తుచేశారు. HNSS, GNSS ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, గండికోట ఆర్‌&ఆర్ ప్యాకేజీ కింద చంద్రబాబు రూ. 475 కోట్లు ఇచ్చారని వివరించారు. టన్నెల్ పనుల వద్ద స్వయంగా పర్యవేక్షించి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని, వైఎస్ కుటుంబం 1978 నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నా కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

మైక్రో ఇరిగేషన్ విధ్వంసం:

పులివెందుల కోసం ఉద్దేశించిన రూ. 1200 కోట్ల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. బిల్లులు చెల్లించకుండా మేఘా సంస్థను వేధించడంతో ఆ పనులు నిలిచిపోయాయని, దీనివల్ల వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయిందని రవి వాపోయారు.

అవినాష్ రెడ్డిపై ఫైర్:

డిడిఆర్సి సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై రవి మండిపడ్డారు. "సమస్యలపై చర్చించే ధైర్యం లేక పారిపోయారు. అంతగా సమాధానం కావాలంటే మీ అన్న జగన్‌ను అసెంబ్లీకి పంపండి, అక్కడ మా ప్రభుత్వం లెక్కలతో సహా సమాధానం చెబుతుంది" అని సవాల్ విసిరారు.

ప్రాధాన్యతలు మారాయి:

"జగన్ శ్రద్ధ అంతా రిషికొండ ప్యాలెస్‌పైనే కానీ, భోగాపురం ఎయిర్‌పోర్టుపై లేదు. అమరావతిని నాశనం చేసి, రాబోయే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు జగన్" అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీమ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని బీటెక్ రవి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News