Weather Update : మండుతున్న ఎండల వేళ చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో వారం పాటు వర్ష బీభత్సం

Weather Update : మార్చి 16 నుంచి 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు, ఈదురు గాలుల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Update: 2026-03-12 01:36 GMT

Rain Alert

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెల సగం కూడా దాటకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న సామాన్యులకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. రానున్న వారం రోజుల్లో వాతావరణంలో పెను మార్పులు రాబోతున్నాయని, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి అకాల వర్షాల జోరు మొదలుకానుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. మార్చి 16 నుంచి 23వ తేదీ వరకు వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

రైతులకు ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వడగండ్ల వానలు పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో, ఈ అకాల వర్షాలు అన్నదాతలకు నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే కోసిన పంటను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మార్చి 14 వరకు ఎండల తీవ్రత కొనసాగినప్పటికీ, 16వ తేదీ నుంచి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఉపశమనాన్ని ఇస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వింతైన వాతావరణ ఆవర్తనం ఇటు ఏపీని, అటు ఒడిశాను ఊరిస్తోంది. ఇది సాధారణంగా అల్పపీడనంగా మారాలి, కానీ అక్కడే స్థిరంగా ఉంటూ తీర ప్రాంతాలకు చల్లటి ఈదురు గాలులను పంపుతోంది. ఏపీలో మార్చి 15 నుంచి 17 వరకు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సడన్‌గా వాతావరణం మారిపోయి, దుమ్ము ధూళితో కూడిన ప్రళయం లాంటి దృశ్యాలు కనిపించే ఛాన్స్ ఉంది. ప్రజలు ఈ అకస్మాత్తుగా మారే వాతావరణంతో వచ్చే జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే అంటార్కిటికా ప్రాంతంలో మళ్లీ భారీ మేఘాల కదలికలు మొదలయ్యాయి. ఇవి హిందూ మహాసముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. దీనివల్ల ఈ ఏడాది ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడూ వర్షాలు పడే అవకాశం ఉంది. శాటిలైట్ డేటా ప్రకారం మేఘాల కదలికలు బలంగా ఉన్నందున, కురిసే కాసేపైనా వర్షాలు బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News