Rewind 2022: టీడీపీకి, జనసేనకు కలిసొచ్చిన 2022.. టీడీపీకి బూస్టప్ ఇచ్చి.. పవన్ గ్రాఫ్ పెంచేసిన..
Rewind 2022: టీడీపీకి, జనసేనకు 2022 కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు.
Rewind 2022: టీడీపీకి, జనసేనకు కలిసొచ్చిన 2022.. టీడీపీకి బూస్టప్ ఇచ్చి.. పవన్ గ్రాఫ్ పెంచేసిన..
Rewind 2022: టీడీపీకి, జనసేనకు 2022 కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు. టీడీపీకి 2022 కాస్తంత బూస్టప్ ఇస్తే.. జనసేన గ్రాఫ్ బాగానే పెరిగినట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ ప్రతిష్టాత్మకమైన మహానాడును సక్సెస్ చేసుకోవటంతో పాటు అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తమ పర్యటనలు స్పీడప్ చేశారు. ఇటు వైసీపీ నేతల తీరుతో పవన్ కళ్యాణ్‌కు మద్దతు పెరిగినట్లు అయింది. దీంతో నిస్తేజంగా ఉన్న పార్టీ క్యాడర్లలలో జోష్ పెరగడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని డీకొట్టగలమన్న కాన్ఫిడెంట్‌ను 2022 గట్టిగానే ఇచ్చినట్లయింది.
కోవిడ్ ఎఫెక్ట్ అన్ని పార్టీలపైనా పడినా.. తిరిగి బలోపేతం కావడంలో 2022 బాగా సపోర్ట్ చేసింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల ఫలితాలు చూసి ఖంగుతిన్నారు. ఇటు మళ్లీ పార్టీ బతికి బట్టకడుతుందా అన్న సందేహంలో చాలామంది సీనియర్ నేతలు సైలెంటయ్యారు. అయితే కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టగానే పార్టీని స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడును ఘనంగా నిర్వహించి పార్టీ క్యాడర్‌కు, నేతలకు రేసులో ఉన్నామన్న సంకేతాలను పంపుతూనే.. వైసీపీని టార్గెట్ చేశారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించి నేతల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. దీనికి తోడు మహానాడు తెచ్చిన ఊపుతో యాక్టివ్‌గా ఉన్న క్యాడర్‌కు నెమ్మదిగా లీడర్లు తోడయ్యారు. గతంలో సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్ర, చింతమనేని ప్రభాకర్ లాంటి వారిపై కేసులు పెట్టగా భయంతో బయటకు రావటం మానేసిన నేతలు కాస్తా అధిష్టానం న్యాయపరంగా ఆదుకుంటామన్న భరోసాతో జనంలో తిరుగుతున్నారు. జిల్లా మహానాడు, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో తిరిగి అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తోంది.
ఇదే సమయంలో ఇదేం ఖర్మ..మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు కూడా పర్యటనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రాంతాలకతీతంగా మంచి స్పందన కనిపించటంతో హైకమాండ్‌లో జోష్ కనిపిస్తోంది. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో బాబు సభలో 8 మంది పార్టీ కార్యకర్తలు చనిపోవటం విషాదకరమైన ఇన్సిడెంట్‌గా మిగిలింది. మరోవైపు తమ కార్యకర్తల్లో, నేతల్లో భయాన్ని నింపి.. పార్టీకి దూరం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల మాచర్లలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, అంతకుముందు పార్టీ ప్రధాన కార్యాలయం, పార్టీ నేత పట్టాభి ఇళ్లపై జరిగిన దాడులు ఇవే సంకేతాలు ఇస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు వాదిస్తున్నారు.
ఇక నారా లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీని నడిపించేందుకు సన్నద్ధమవ్వడం టీడీపీకి 2022 లో కలిసొచ్చిన మరో అంశంగా చెప్పొచ్చు. 2022 దసరా నుంచి లోకేష్ పాదయాత్ర ప్లాన్ చేసినా.. 2023 జనవరి 27కి ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ పాదయాత్ర సక్సెస్ అయితే మళ్లీ పార్టీ పూర్వ వైభవం రావటం ఖాయమని పార్టీ వర్గాలే కాదు.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేనతో కుదిరితే జనసేన, బీజేపీతో కూడా కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ టీడీపీ ఉంటుందనే సంకేతాలిచ్చారు చంద్రబాబు. కాసాని జ్ఞానేశ్వర్ కు పగ్గాలు అప్పగించడంతో పాటు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇక్కడ కూడా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.
ఇక 2022 వ సంవత్సరాల్లో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా కనిపించిన మరో పార్టీ జనసేన. పవర్ స్టార్‌గా ప్రజాదరణ పొందిన పవన్, రాజకీయంగా జనాదరణ సాధించేందుకు 2022 కొంత సాయపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా వైసీపీని గద్దెదించటమే లక్ష్యమని ప్రకటించిన పవన్ కళ్యాణ్...తన లక్ష్యాన్ని చేరుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయటానికి 2022 తోడయింది. ఇక తన ఎన్నికల వాహనం వారాహితో అతి త్వరలో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పవన్ వైసీపీతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
ఎన్నో అంచనాలతో ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన పవన్‌కు 2019 ఎన్నికలు దారుణమైన ఫలితాలను అందించాయి. గెలిచిన ఏకైక సీటు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ కండువా కప్పుకోవటంతో జీరోగా మిగిలింది జనసేన. అయితే 2022 మాత్రం జనసేనకు మంచి భవిష్యత్తు ఉందన్న సంకేతాలు బాగానే కనిపించాయి. మార్చిలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి.. ఏడాది ముగింపు వరకూ ఏదో ఒక యాక్టివిటీ ద్వారా జనసేన వార్తల్లో నిలిచింది. పవన్‌ను టీడీపీ దత్తపుత్రుడిగా కౌంటర్ వేస్తున్న వైసీపీ..టీడీపీ కంటే జనసేనే తమ మెయిన్ టార్గెట్ అన్నట్లుగానే నేతలంతా ప్రవర్తించారు. వైజాగ్ పర్యటనలో పవన్‌ను పోలీసులు అడ్డుకుని హోటల్‌కు పరిమితం చేయటం, ఆ తర్వాత ఇప్పటం గ్రామ పర్యటనకు పవన్‌కు ఆంక్షలు పెట్టడం, దీంతో కారుపైకి ఎక్కి పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లటం, పార్టీ కార్యాలయం వద్ద ఆంక్షలు పెట్టటం వంటి ఘటనలు ఏపీ రాజకీయాల్లో హీట్ రాజేయగా ప్రజల్లో రెండు పార్టీల గురించి పెద్ద చర్చే జరిగింది.
ఇక వైసీపీని ఓడించేందుకు పవన్ తన ముందున్న ఆప్షన్స్‌ను ప్రకటించారు. టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయటం, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లటం, లేదంటే సింగిల్‌గానే పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని మోడీతో జరిగిన మీటింగ్‌లో బీజేపీతో పొత్తు కొనసాగించాలనీ, టీడీపీతో కొంత దూరం పాటించాలని చెప్పడంతో పవన్ కాస్త కన్ఫ్యూజన్లో పడ్డారన్న వార్తలు వినిపించాయి. కానీ బీజేపీకి దూరమైనా పర్లేదు..టీడీపీ కలిసి ముందుకు వెళ్లడం మంచిదన్న విశ్లేషకుల సలహాకే పవన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇటు ఇప్పటికే నిర్వహిస్తున్న జనవాణి, కౌలురైతు భరోసా కార్యక్రమాలను కొనసాగిస్తూనే తన ఎన్నికల ప్రచారాన్ని 2023 ప్రారంభంలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొంత సమయం సినిమాలకు కేటాయిస్తూనే మిగిలిన సమయాన్ని రాజకీయాలకు ఉపయోగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.