వైసీపీ అధికారంలోకి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సస్పెండ్ చేశారేంటి?: కేశినేని నాని

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Update: 2020-02-09 09:46 GMT

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'మీరు సీఎం అవ్వటానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, టీడీపీ ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే.. సస్పెండ్ చేశారేంటి జగన్‌ గారూ' అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. కాగా ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ , అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం.

అయితే తన సస్పెన్షన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆయన ఓ లేఖ రాశారు. దీని వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు.

వాస్తవానికి గత ప్రభుత్వంతో మరింత సన్నిహితంగా వ్యవహరించారన్న ఆరోపణ ఏబీ వెంకటేశ్వరరావు పై ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంలో ఆయన పాత్ర ఉందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది.

ఇదిలావుంటే నిదుల దుర్వినియోగం చేసిన ఆరోపణల్లో ఇప్పటికే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.


Tags:    

Similar News