Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి..గోడకూలి ఏడుగురు భక్తులు దుర్మరణం
Simhachalam: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి నెలకొంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. దీంతో ఏడుగురు భక్తులు మరణించారు. నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురవడంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ. 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది.
వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏడుగురి డెడ్ బాడీలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.