Simhachalam: సింహాచలం ఘటనపై మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరణించినవారి కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడిన వారికి రూ. 3లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆదేశించారు.
ఈ టెలీకాన్ఫరెన్స్ లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం గురించి ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
అటు సింహాచలం ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చందనోత్సవ సమయాన ఈ ఘటన చోటుచేసుకోవడం దురద్రుష్టకరమన్నారు. ఈ మేరకు ఎక్స్ లో జనసేన పార్టీ పోస్టు చేసింది.
మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. విశాఖ జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలను తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడకూలిందని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు