Raghu Rama Krishna Raju : సొంతపార్టీకి షాకిద్దామనుకున్న.. రాజుగారి ఫ్యూజు ఎగిరిపోనుందా?

Update: 2020-07-04 11:48 GMT

Raghu Rama Krishna Raju in defence that BJP is not interested in his politics : నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టుగా గబ్బర్‌సింగ్‌ లెవల్లో డైలాగులు దంచారు రఘురామ రాజు. తిడుతున్నారో, పొగుడుతున్నారో అర్థంకానట్టు, చిక్కడు దొరకడు రేంజ్‌లో, తికమక మకతిక పెట్టారు రాజు. అయితే, రాజుకే మతిపోయే స్ట్రాటజీకి వైసీపీ పదునుపెట్టిందా? లెక్క పక్కాగా చూసుకుని హస్తినలో వాలిపోయిందా? రాజుగారిలో అలజడికి కారణం అదేనా? రఘురామ లెక్క ఎక్కడ తప్పింది? నరసాపురం ఎంపీ ఫ్యూచర్‌ ఏంటి?

రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో తన పలుకుబడికి ఎదురేలేదనుకున్నారు. బీజేపీ పెద్దలతో తనది అవినాభావ బంధమనుకున్నారు. గోదావరి వంటకాల విందుతో మరింతగా రిలేషన్ పెనవేసుకుందనుకున్నారు. సస్పెన్షన్‌ వేటు కాస్త వేయించుకుంటే, ఏం చక్కా ఫ్రీ బర్డ్‌గా బీజేపీలో చేరిపోయి, కేబినెట్‌కు సైతం ట్రై చేసుకోవచ్చని భావించినట్టున్నారు. ఎలాగూ ఏపీలో బీజేపీ బలోపేతం కావాలనుకుంటోంది కాబట్టి, అందుకు తానొక అస్త్రమవుతానని, కాషాయం అనుకుంటుందని ఊహంచారు. ఆశించారు. సొంత పార్టీపై ధిక్కారం పెంచారు. కానీ రాజుగారు ఊహించినట్టుగా జరుగుతున్నట్టు పరిణామాలు కనిపించడం లేదు. అంతకుమించి చకచకా ఇన్సిడెంట్స్‌ జరుగుతున్నాయి. అదే రాజుగారిలో అలజడే పెంచుతోందని అర్థమవుతోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బీజేపీకి రహస్య స్నేహితుడు. ఈ మాట ప్రతిపక్ష తెలుగుదేశానికి కూడా తెలుసు. 2014 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన దాదాపు అన్ని బిల్లులకూ వైసీపీ మద్దతిచ్చింది. 2019లో లోక్‌సభలో వైసీపీ బలం పెరిగింది. రాజ్యసభలోనూ తాజాగా నాలుగు సీట్లు వైసీపీకి పెరిగాయి. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీ, రాజ్యసభలో తొమ్మిదో అతిపెద్ద పార్టీగా వుంది. మోడీ సర్కారును పల్లెత్తు మాటా అనదు. అడక్కపోయినా ప్రతి బిల్లుకూ ఉభయసభల్లోనూ మద్దతిస్తుంది. అడిగిన వెంటనే అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటిచ్చింది. ఇంతమంది ఎంపీలున్న అప్రకటిత మిత్రపక్షాన్ని, ఒక్క ఎంపీ కోసం బాధపెడుతుందా? రెండు పార్టీల మధ్య కెమిస్ట్రీ ఇంతబాగా వున్నప్పుడు, రాజుగారిని భుజానికెత్తుకుంటుందా? లైట్‌ తీసుకుంటుందా? లాజిక్‌లు మాత్రమే నమ్ముకున్న రాజు, రాజకీయాల్లో మ్యాజిక్‌ పని చేస్తే మామూలుగా వుండదని ఎందుకు మర్చిపోయారని అంటున్నారు విశ్లేషకులు.

బీజేపీ పెద్దలు, కేంద్రమంత్రుల అండదండలు తనకు వున్నాయన్నది రాజుగారి కాన్ఫిడెన్స్. స్పీకర్‌తో మంచి రిలేషన్స్‌‌పై అపారనమ్మకం. ఇవన్నీ పక్కనపెడదాం ఒకవేళ రాజుగారు తపిస్తున్నట్టుగా, బీజేపీ కూడా తపిస్తోందా రాజు కోసం. ఇందుకు నో అనే ఆన్సరంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఎందుకంటే, రాజుగారిపై కాషాయానికి ఎలాంటి ఇంట్రెస్టూ లేదట. ఆయనను నమ్ముకుంటే ఏపీలో కమలాన్ని పరుగులు పెట్టిస్తామన్న ఊహలూ లేవట. పార్టీలు అదే పనిగా మారే రాజు కోసం, రాబోయే కాలంలో సంకీర్ణ శకమేనని తెలిసిన బీజేపీ, వైసీపీని నొప్పించి, దూరం చేసుకోలేదు. రాజుగారు ఏదో ఆశించే, తమ వెంట పడుతున్నారని బీజేపీ అధిష్టానం భావిస్తోందని అనలిస్టుల మాట. ఈ నేపథ్యంలోనే వైసీపీకి బీజేపీ నుంచి స్పష్టమైన అండదండలుంటాయన్న సంకేతాలు వచ్చాయని తెలుస్తోంది. అదుకే రాజుగారిపై వేటు వెయ్యడానికి, భారీ సంఖ్యలో ఎంపీలను హస్తినలో మోహరించింది వైసీపీ. అందుకే రాజుగారిలో అలజడి అట.

పార్లమెంట్‌ ఉభయ సభల్లో అన్ని బిల్లులకూ మద్దతిస్తున్న వైసీపీ కోసం బీజేపీ ఫేవర్‌ చెయ్యదా అని అంటున్నారు విశ్లేషకులు. ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగి, రాజుపై వేటు వెయ్యాలని మోడీ, అమిత్‌ షాలను అడిగితే ఒప్పుకోకుండా వుంటారా అంటున్నారు అనలిస్టులు. నితీష్‌ కుమార్‌ ఫ్రెండ్‌షిప్‌ కోసం శరద్‌ యాదవ్‌పై వేటు వేసిన కేంద్ర పెద్దలు, జగన్ స్నేహం కోసం రాజుపై అనర్హతా అస్త్రాన్ని సంధించారా అని అంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి కేంద్ర పెద్దల అండాదండల సంకేతాలతోనే, వైసీపీ ఢిల్లీలో ల్యాండయ్యిందని తెలుస్తోంది. సడెన్‌గా రాజు హైకోర్టులో పిటిషన్ వెయ్యడం, ఈ పరిణామాలకు బలం చేకూరుస్తోంది. మొన్నటి వరకు దీమాగా వున్న రఘురామలో అలజడికి నిదర్శనం. చూడాలి, వైసీపీ పట్టుబిగుస్తున్న నేపథ్యంలో రాజుగారు శరణు అంటారో రణమేనని కత్తి దూస్తారో చివరికి ఏమవుతుందో.

Full View


Tags:    

Similar News