AP Bus Fire: పండగ వేళ తప్పిన పెను విషాదం.. దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..!!
AP Bus Fire: పండగ వేళ తప్పిన పెను విషాదం.. దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..!!
AP Bus Fire: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై కలకలం రేపింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణం మధ్యలో బస్సు వెనుక భాగం నుంచి పొగ రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డుపక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులను కిందికి దింపడంతో ప్రాణాపాయం తప్పింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం ఇంకా ప్రజల మనసుల్లో నాటుకుపోయి ఉంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రైవేట్ బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తుండగా, బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.