సాలూరు శపథాల ప్రకంపనలేంటి?

Update: 2019-07-10 12:18 GMT

ఆ నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి ఆ ఇద్దరూ పోటిపడ్డారు వారిద్దరూ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలుగా రికార్డు క్రియేట్ చేసినవారే. అంతటి చరిత్ర కలిగిన వారిద్దరూ 2019 ఎన్నికల్లోనూ తలపడ్డారు. హోరాహోరీగా తలపడ్డారు. వారిలో ఒకరు ఇవే తన చివరి ఎన్నికలని కూడా ప్రజలను ప్రాధేయపడ్డారు. ఇప్పుడు తన ఫ్యూచరేంటని కంగారుపడుతున్నారు.

విజయనగరం జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గాలలో ఒకటి సాలూరు. ఈ నియోజకవర్గానికి ఎంతో విశిష్టత ఉంది. ఒడిశాకు ఆనుకున్ని ఉండటం, రాష్ట్రంలో అతిపెద్ద రెండో లారీ పరిశ్రమ సాలూరులో ఉంది. సాలూరులో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నా, రాజకీయంగా చైతన్యవంతులనే చెప్పాలి. నమ్మితే అందలం ఎక్కించడం అపనమ్మకం కలిగితే దించేయడం ఇక్కడ సర్వసాధారణం. ఈ కోవలోనే సాలూరు నుంచి కొన్నేళ్ళుగా పీడిక రాజన్నదొర, భంజ్‌దేవ్‌లు చెరో మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా వీరిద్దరే పోటిపడ్డారు. ఈ ఎన్నికల్లో పీడిక రాజన్నదొర వరసగా నాలుగోసారి విజయంతో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. భంజ్‌దేవ్‌ పొలిటికల్ జర్నీ సందిగ్దంలో పడింది.

నిజాయితిపరుడిగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు రాజన్నదొర. ఇదే ఆయన విజయానికి ప్రధాన కారణంగా నిలిచిందని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలోని నాయుకులు. దీనికితోడు జగన్మోహనరెడ్డి పట్ల ప్రజల నమ్మకం, రాజన్నదొర విజయానికి ముఖ్యకారణమయ్యాయని మరికొందరు అనుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్‌ ఫ్యూచరేంటన్నదానిపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో ఓటమితో తన రాజకీయ భవితవ్యం ఏంటన్న గందరగోళంలో పడ్డారు టిడిపి నేత భంజ్‌దేవ్‌. ఆయన ఓటమికి అనేక కారణాలు దారి తీశాయని కూడా చెప్పుకుంటున్నారు స్థానిక జనం. భంజ్‌దేవ్‌ అసలైన గిరిజనుడు కాదన్న వివాదం నడుస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో తాను ఎస్టీ అంటూ జీఓ తెచ్చుకున్నారని భంజ్‌దేవ్‌‌పై విమర్శలున్నాయి. అయితే దానిని సవాల్‌ చేస్తూ రాజన్నదొర హైకోర్టుకు వెళ్లడంతో, భంజ్‌దేవ్‌ కులవివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాను కొండరాజు కులానికి చెందినవాడినంటూ భంజ్‌దేవ్‌ వాదిస్తుండగా, అసలు భారత రాజ్యాంగంలో కొండరాజు పేరుతో ఎస్టీ జాబితాలో కులం లేదని రాజన్నదొర చెబుతున్నారు. వీటితోపాటు నియోజకవర్గంలోని చేపలచెరువులు, ప్రభుత్వ, గ్రామదేవత భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు భంజ్‌దేవ్‌పై ఉన్నాయి. వీటితో పాటు నెలకొన్న వివాదాలు కూడా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సాలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1994లో తొలిసారి తెలుగుదేశం అభ్యర్థిగా తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమచంద్ర సన్యాసిరాజుపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు భంజ్‌దేవ్‌. మళ్లీ 1999లో జరిగిన ఎన్నికల్లో, ప్రస్తుత ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిపై పోటీచేసి గెలుపొందారు. ఆపై 2004 ఎన్నికల్లో పీడిక రాజన్నదొరపై గెలిచి హ్యట్రిక్‌ సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో భంజ్‌దేవ్‌ గిరిజనుడు కాదంటూ హైకోర్టులో రాజన్నదొర పిటిషన్‌ వేయడం, గెలవడంతో 2006లో రాజన్నదొర గెలిచినట్టుగా కోర్టు ప్రకటించింది. అదే భంజ్‌దేవ్‌ పతనానికి నాంది పలికిందన్న వాదన ఉంది.

నాటి నుండి నేటి వరకు తిరిగి అధికారం కోసం విశ్శప్రయత్నాలు చేసినా, ప్రజల మనసులను గెలుచుచుకోలేకపోయారు భంజ్‌ దేవ్. ఓ పక్క టిడిపిలో వర్గపోరుతో అంతర్గత కుమ్ములాటలు, దీనికి తోడు కులవివాదం తనను వెంటాడటం, ఇవన్నీ భంజ్‌దేవ్‌ రాజకీయ భవిష్యత్‌ను అయోమయంలో పడేసాయి. తనకివే చివరి ఎన్నికలంటూ ప్రజలను ప్రాధేయపడినా వారి మనసులను మాత్రం కరిగించలేక చివరకు ఓటమిని అందుకోక తప్పలేదు భంజ్‌దేవ్‌కు. ఇవే తనకు ఇవే చివరి ఎన్నికలన్న భంజ్‌దేవ్‌ రాజకీయ ప్రయాణానికి ఇక్కడితో పుల్ స్టాప్ పడుతుందా లేక తూచ్‌ అంటూ మరోసారి రంగంలోకి దిగుతారా అన్నది చూడాలి.

Full View  

Tags:    

Similar News