శ్రీశైలంలో మరో భారీ కుంభకోణం : మంత్రి సీరియస్
కర్నూల్ జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
కర్నూల్ జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని టిక్కెట్లు, అలాగే ఆర్జిత సేవల టిక్కెట్లు విక్రయాల్లో అవక తవకలు జరిగినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఆలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 1. 40 కోట్ల నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించారు.
ఈ అవినీతిలో బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. అంతే కాదు ఇదే విధంగా గత జనవరి నెలలో ఇలాంటి ఘటనే శ్రీశైలం దేవస్థానంలో వెలుగు చూసింది. విరాళ కేంద్రంలో విధులను నిర్వహించే ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు వారి చేతివాటం ప్రదర్శించి సుమారు రూ.80 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారని ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.
శ్రీశైలం దేవస్థానంలో ఆర్థిక అవకతవకలపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నగదు రికవరీ చేయాలని, భాద్యులైన వారిని కఠినంగా శిక్షంచాలని కర్నూల్ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేపట్టాలని కోరారు. తక్షణమే నగదు రికవరీ పనులు చేపట్టాలని.. ఈ ఘటన పై నివేదిక సమర్పించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.