వారికి టిడ్కో ఇళ్లు ఇవ్వండి..మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం విజయవాడలో సుదీర్ఘ పర్యటన చేపట్టారు.
వారికి టిడ్కో ఇళ్లు ఇవ్వండి..మంత్రి నారాయణ కీలక ఆదేశాలు
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం విజయవాడలో సుదీర్ఘ పర్యటన చేపట్టారు. వర్షాలకు నగరంలో ఏర్పడిన పరిస్థితిని సమీక్షిస్తూ, పలు ప్రాంతాల్లో స్వయంగా పరిస్థితిని పరిశీలించారు.
మంత్రి నారాయణతో పాటు పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పుల్లేటి కట్ట, దర్శిపేట అవుట్‌ఫాల్ డ్రెయిన్లు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఆటోనగర్ డంపింగ్ యార్డును కూడా ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అక్రమ కట్టడాలు వలన డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని గుర్తించిన మంత్రి, వెంటనే వాటిని తొలగించాలంటూ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇళ్లను కోల్పోయే పేదలకు టిడ్కో ఇళ్లు కేటాయించాలని సూచించారు.
డ్రెయినేజీ నిర్మాణాలపై విమర్శలు
వర్షపు నీరు, మురుగునీరు సాఫీగా పారేందుకు 2014లోనే డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఈ పనులు ప్రారంభమయ్యాయని, అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత డ్రెయినేజీ పనులు ఆపేశారని ఆరోపించారు.
“డ్రెయిన్లు 10 అడుగుల వెడల్పు ఉండాల్సిన చోట కేవలం 2 అడుగులకు పరిమితమయ్యాయి. పలు ప్రాంతాల్లో కాలువల్లో అక్రమంగా ప్రహరీ గోడలు కట్టారు. వీటిని తొలగించకపోతే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది,” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
వడిగా చర్యలు – సెప్టెంబర్ నుంచి పనులు
వెంటనే డ్రెయిన్ల ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించాలని, డ్రెయిన్లు వెడల్పు చేయాలని కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో చర్చించి పరిష్కారానికి దోహదపడతారని వెల్లడించారు. సెప్టెంబర్ నుండి డ్రెయినేజీ పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేస్తామని, వచ్చే వర్షాకాలానికి ముందు పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.
బుడమేరు పై నిర్ణయం త్వరలోనే
ఇక బుడమేరు కాలువ ఆక్రమణలపై నీటిపారుదల శాఖ సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి వెల్లడించారు. బుడమేరుపై రెండు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిపై పరిశీలన అనంతరం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.