Tirumala: తిరుమలలో వెలుగులోకి మరో స్కామ్

Tirumala: మొన్న కల్తీ నెయ్యి...నిన్న పరకామణి చోరీ... తాజాగా పట్టు శాలువాల కుంభకోణం... అసలు దేవ దేవుడి కొలువులో ఏం జరుగుతోంది...?

Update: 2025-12-12 09:26 GMT

Tirumala: తిరుమలలో వెలుగులోకి మరో స్కామ్

Tirumala: మొన్న కల్తీ నెయ్యి...నిన్న పరకామణి చోరీ... తాజాగా పట్టు శాలువాల కుంభకోణం... అసలు దేవ దేవుడి కొలువులో ఏం జరుగుతోంది...? వరుస ఘటనలు భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయా...? ఏడు కొండల వాడికే శఠగోపం పెడుతున్నది ఎవరు..?

ఆధ్యాత్మిక క్షేత్రం కలియుగ వైకుంఠం తిరుమలలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిన్నటి వరకు కల్తీ నెయ్యి, పరకామణి చోరీ వంటి ఆరోపణలతో సంచలనం సృష్టించిన టీటీడీలో... ఇప్పుడు ఏకంగా స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ చైర్మన్,టీటీడీ ఆదేశాల మేరకు ఇటీవల చేపట్టిన తనిఖీల్లో ఈ స్కాం బయటపడింది. మొత్తం 21,600 శాలువాల కొనుగోలు ప్రతిపాదనను పరిశీలిస్తున్న సమయంలో ఈ మోసం వెలుగు చూసింది. టెండర్ నిబంధనల ప్రకారం... ఈ శాలువాలు 100శాతం మల్బరీ సిల్క్‌త్ో తయారై ఉండాలి. ఈ వస్త్రం 1 మీటర్ వెడల్పు, 2.3 మీటర్ల పొడవు కలిగి, మధ్యలో తెలుగు, సంస్కృతంలో 'ఓం నమో వెంకటేశాయ' అనే పదం, శంఖు, చక్ర, నామం చిహ్నాలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సిల్క్ మార్క్ హోలోగ్రామ్ లేబుల్ కూడా ఉండాలి. కానీ, అధికారులు సేకరించిన నమూనాలు ఏం తేల్చాయి? అసలు ఎంత భారీ మోసం జరిగింది?

శ్రీవారికి సంబంధించిన పట్టు వస్త్రాలు, శాలువాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తేలడంతో విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. తిరుపతి గోడౌన్‌లోని కొత్త స్టాక్‌తో పాటు, తిరుమల వైభవోత్సవ మండపంలోని ఆమోదిత స్టాక్ నుంచి నమూనాలు సేకరించారు. ఈ స్టాక్ మొత్తాన్ని నగరి ప్రాంతానికి చెందిన ఒక సంస్థ సరఫరా చేసింది. ఈ నమూనాలను బెంగళూరు, ధర్మవరం సెంట్రల్ సిల్క్ బోర్డు ల్యాబ్‌లకు పరీక్షల నిమిత్తం పంపగా... రెండు ల్యాబ్‌లు కూడా అవి సిల్క్ కాదని, పాలిస్టర్ అని నిర్ధారించాయి. టెండర్ ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ లేబుల్ కూడా లేదని తేలింది.

ఇక్కడే అసలు ట్విస్ట్ గతంలో వేర్ హౌస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంపిన నమూనాలను కాంచీపురం సిల్క్ బోర్డు ల్యాబ్ ఆమోదించింది. కానీ ఇటీవలి పరీక్షల్లో పాలిస్టర్ అని తేలడంతో... పాత నమూనాలలో మార్పు జరిగిందా? లేక ల్యాబ్ మానిప్యులేషన్ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఎస్ ఎక్స్‌పోర్ట్, దాని అనుబంధ కంపెనీలు 2015 నుంచి 2025 మధ్య కాలంలో టీటీడీకి 54కోట్ల 95లక్షల విలువైన దుస్తులు సరఫరా చేశాయి. ఇటీవల ఇచ్చిన 15వేల శాలువాల కాంట్రాక్ట్ కూడా ఒక్కో దానికి 1,389 రూపాయల చొప్పున ఈ సంస్థకే దక్కింది. ఇవి కూడా పాలిస్టరే అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మోసం వల్ల టీటీడీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని విజిలెన్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది.

గత టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం... సరఫరాదారు మెటీరియల్‌లో మోసం చేశాడని నిర్ధారించారు. టీటీడీపై మచ్చ తెచ్చిన ఈ భారీ అవినీతిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News