జేడీ మౌనం దేనికి సంకేతం?

Update: 2019-08-03 04:12 GMT

జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ ఒంటరి అయ్యారా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. నిన్న మొన్నటి దాకా జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉన్న జేడీ, అనూహ్యంగా దూరంగా ఉండటం వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది. జేడీ ఒంటరి అయిపోయాడు అనే చర్చ రాజకీయ వర్గాల్లో కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి పార్టీలోని కొందరు నేతలే కారణమన్న చర్చ నడుస్తోంది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. యూత్‌లో రియల్ హీరోగా అభిమానం పొందారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. విశాఖపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయినా, పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించారు. అయితే ఇప్పుడాయన జనసేనలో ఒంటరయ్యారన్న అంశం, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమిపాలైన తర్వాత కూడా పలు కీలక జనసేన సమావేశాలకు జెడి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అంతేకాకుండా విశాఖ నియోజకవర్గంలో చాలా వరకు పార్టీ తరఫున పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ నిన్న మొన్నటి వరకు పార్టీలో ఒక కీలక నేతగా ఉన్న జెడి లక్ష్మీనారాయణ ఇపుడు మౌనం వహిస్తున్నారు.

జూన్ నెలలో జరిగిన వివిధ నియోజకవర్గాల సమావేశాల్లో సైతం జేడీ లక్ష్మీనారాయణ అటెండయ్యారు. పార్టీ నిర్వహించిన పలు సమావేశాల్లో సైతం కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఈమధ్య ఆయన, పార్టీలో అంత క్రియాశీలకంగా లేకపోవడం చర్చకు దారితీస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన పలు కమిటీల్లో, ఆయన పేరు లేకపోవడం వలనే దూరం పెరిగిందన్నది రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.

పవన్ ఇప్పటికే ప్రకటించిన పలు కమిటీల్లో జేడీ లక్ష్మీనారాయణకి స్థానం లేకపోవడంతో పార్టీలో తనకి తగిన ప్రాధాన్యత లేదని, జేడీ లక్ష్మీనారాయణ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. పవన్ కల్యాణ్‌ తననెందుకు దూరం పెడుతున్నారో అర్థంకావడం లేదని, ఆయన ఆవేదన వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే, జనసేనలో జేడీకి ప్రాధాన్యత తగ్గిపోవడానికి, ఆ పార్టీలో కొందరు నేతలే కారణమన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే జనసేనవర్గాలు మాత్రం, ఇవన్నీ కేవలం ప్రచారమేనని ఖండిస్తున్నాయి. పార్టీ ఫండ్ రైజింగ్ కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మి నారాయణ ఉండాలని కోరినప్పటికీ, దాన్ని జెడి సున్నితంగా తిరస్కరించారని, పార్టీ నేతలంటున్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి జేడీ సైలెన్స్‌, జనసేనలో అనేక ఊహాగానాలకు ఆస్కారమిస్తోంది. ఇకనైనా పవన్-జేడీ మధ్య దూరం మరింత పెరుగుతుందా లేదా కలిసి నడుస్తారో చూడాలి.

Full View

Tags:    

Similar News