Rewind 2022: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు.. టార్గెట్‌ రీచ్ అయ్యేందుకు కీలకంగా మారిన..

Rewind 2022: మూడు రాజధానులపైనే మెయిన్ ఫోకస్.. గడపగడపకు కార్యక్రమంపై ఫుల్ కాన్సన్‌ట్రేషన్

Update: 2022-12-31 15:00 GMT

YSRCP: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు

Rewind 2022: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటింది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ పరంగా 2022 సంవత్సరం అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ లక్ష్యాన్ని రీచ్ అయ్యేందుకు పార్టీని పూర్తిగా స్పీడప్ చేశారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరికీ వివిధ రకాల కార్యక్రమాల బాధ్యతలు అప్పగించి పార్టీకి ఏడాది ఫుల్ జోష్ తీసుకొచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమంతో పాటు పార్టీలో వాలంటీర్ల వ్యవస్థను కూడా ఈ ఏడాది తీసుకొచ్చారు.

2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన వైసీపీ మూడున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకుని కొత్త ఏడాదిలో అడుగుపెడుతోంది. 2022లో చాలా కీలక కార్యక్రమాలు చేపట్టిన ఏపీ సర్కార్ ప్రభుత్వపరంగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా మారిపోయింది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడానికి సీఎం జగన్ పక్కా స్కెచ్‌తో పావులు కదుపుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఈ 2022 మేలో ప్రారంభించిన జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకు వెళ్లడమే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. కేవలం కార్యక్రమం నిర్వహించడమే కాకుండా దానికి సంబంధించిన ఫాలో అప్‌ని సీఎం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కార్యక్రమం జరుగుతున్న తీరుపై నిరంతరం సర్వేలు నిర్వహిస్తూ, సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని ఇప్పటికే నేతలందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చేయడంతో గడపగడపకు కార్యక్రమాన్ని ప్రతీనేత ఓ చాలెంజ్‌గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ తలెత్తింది.

పార్టీ పరంగా 2022 YCPకి చాలా కీలకమనే చెప్పాలి. ఈ ఏడాది జులై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశం కావడంతో ఘనంగా నిర్వహించింది వైసీపీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విషయంలో పెద్దగా పట్టించుకోని సీఎం జగన్ జూలైలో జరిగిన ప్లీనరీ నుంచి పార్టీపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు. ప్లీనరీలో మూడేళ్ల నుంచి తాను ఎలాంటి పథకాల అమలు చేశాననే విషయాలను వివరించిన జగన్ రానున్న రోజుల్లో పార్టీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి 175 స్థానాలు గెలవాలనే టార్గెట్‌ను కూడా ఈ ప్లీనరీ వేదికగానే ప్రకటించారు. అయితే ఇదే ప్లీనరీలో వైఎస్ విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా రాజీనామా చేయడం ఏపీ పొలిటికల్ టెంపరేచర్‌ను ఒక్కసారిగా పెంచేసిందనే చెప్పొచ్చు. జగన్ తీరుపై విపక్షాలే కాదు సొంతపార్టీ నేతల్లో వ్యతిరేక గళం వినిపించిందనే టాక్ పెద్ద ఎత్తున నడిచింది.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతూ వస్తున్న జగన్ ఆ విషయాన్ని తెలియజేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రుల బస్సు యాత్రను ఏర్పాటు చేశారు. అలాగే జయహో బీసీ మహాసభ పేరుతో బీసీలకు చేస్తున్న కార్యక్రమాలు పార్టీలో ఇస్తున్న ప్రాధాన్యత వంటి విషయాలను వివరించారు. మరోవైపు ఉత్తరాంధ్ర రాయలసీమలో మూడు రాజధానులకు మద్దతుగా సభలు, గర్జనలు నిర్వహించి నేతలంతా ప్రకటనలు చేశారు. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందని ఎమ్మెల్యేలు, ఎంపీలు పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇటు మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా మారడంతో అమరావతి రైతులు పాదయాత్రతో రోడ్డెక్కారు. మొత్తంగా 2022లో రాజధాని ఇష్యూ వైసీపీని ఇరుకున పెట్టినట్లే అయింది.

2022 సంవత్సరం చివరిలో పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. పార్టీలో ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తిగా మార్పులు చేర్పులు చేసి నియామకాలు చేపట్టారు. ముఖ్యంగా పార్టీ 26 జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు నియోజకవర్గ పరిశీలకుల నియామకాలు చేపట్టారు. ఇక పార్టీలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన సీఎం జగన్ ఇటు పార్టీ పరంగా సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి 2022 వైసీపీ కీలకమైన నిర్ణయాలు కొన్ని ప్రశంసలు అందుకుంటే మరికొన్ని విమర్శల పాలు చేసినట్లయింది. 

Tags:    

Similar News