స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు... మూడు రాజధానుల అంశాన్ని..

Update: 2020-08-15 05:08 GMT

Independence Day 2020: 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి పౌరుడు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్న సీఎం ఎస్సీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తున్నాం రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్థికసాయం చేస్తున్నామని వివరించారు. పేద పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదవకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

రైతు భరోసా, పెన్షన్ కానుక, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, కంటి వెలుగు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదాలకు అతీతంగా నవ రత్నాలు అందిస్తున్నామని చెప్పారు. 14 నెలలుగా గొప్ప సంకల్పంతో అడుగులు వేశామని తెలిపారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, అలాంటి గాయాలు మరల తగలకూడదన్నా రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. అందుకే వికేంద్రీకరణే సరైనదని నిర్ణయించామని జగన్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లులను చట్టంగా మార్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జగన్ తెలిపారు. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రంగా న్యాయ రాజధానికి పునాదులు వేస్తామని సీఎం జగన్ తెలిపారు.


Tags:    

Similar News