Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14రోజుల రిమాండ్
Vallabhaneni Vamsi: గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, క్రిష్ణప్రసాద్ కు కూడా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్రప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. తర్వాత ముగ్గురికీ 14రోజుల చొప్పున రిమాండ్ విధించారు.
ఇక వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సత్యవర్థన్ ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉంది. అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బ్రుందాలు ఏర్పాటు చేశాము. విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడుకు తీసుకువచ్చాము. ఈ కేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారు. సత్యవర్థన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించార అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం ఉదయం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వంశీతోపాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేయగా..ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎలిమినేని శివరామక్రిష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు.