చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేష్, కాసాని జ్ఞానేశ్వర్
Chandrababu: చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేష్, కాసాని జ్ఞానేశ్వర్
Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. చంద్రబాబును భువనేశ్వరి, లోకేష్‌తో పాటు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ఇదిలా ఉంటే.. తనకు జైల్లో భద్రత పెంచాలని, తనకు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు చంద్రబాబు. ఈ లేఖపై స్పందించిన జైళ్ల శాఖ డీఐజీ.. భద్రత కట్టుదిట్టం చేశామని బదులిచ్చారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎప్పటికప్పుడు వైద్యబృందం పరీక్షలు చేస్తోందని తెలిపారు.
చంద్రబాబు శరీరంపై ఎలర్జీ కూడా తగ్గిందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వైద్యులు కంటి పరీక్షలు కూడా చేశారని, కుడి కంటికి ఆపరేషన్ చేయాలని, కానీ.. అత్యవసరం కాదని వైద్యులు తెలిపారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులకు, ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు రిపోర్టులు అందిస్తున్నామన్నారు. చంద్రబాబుకు మావోయిస్టుల పేరిట వచ్చిన బెదిరింపు లేఖ ఫేక్ అని తేల్చామన్నారు. చంద్రబాబు భద్రత, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన వద్దన్న జైళ్ల శాఖ డీఐజీ.. గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఓ దొంగతనం కేసులో జైలుకొచ్చిన ఓ రిమాండ్ ఖైదీ వద్ద బటన్ కెమెరా గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అతడిపై పోలీస్ కేసు నమోదు చేశామని, ఆ ఖైదీని విజయవాడ కోర్టుకు తరలించగా.. బెయిల్‌పై విడుదలయ్యాడని తెలిపారు జైళ్ల శాఖ డీఐజీ.