ఈ-జాగృతి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతోపాటు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఢిల్లీ రావు తెలిపారు.

Update: 2025-12-24 14:43 GMT

విజయవాడ: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతోపాటు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఢిల్లీ రావు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025 సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో బుధవారం రాష్ట్ర స్థాయి వేడుకలను ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’ అనే థీమ్ తో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఢిల్లీ రావు మాట్లాడుతూ, ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్ పేర్కొన్న విధంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రతి వినియోగదారుడు కల్గి ఉండాలన్నారు. వినియోగదారుల కోర్టుల (Consumer Courts) తీర్పులు వేగంగా, సమర్థవంతంగా వెలువడటంలో డిజిటల్ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. పెరుగుతున్న సాంకేతికతతోపాటు వినియోగదారులకు ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయన్నారు.

1986 వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి, 2019 నాటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు. ముఖ్యంగా ఈ-కామర్స్ ఆన్ లైన్, సైబర్ మోసాల నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ఎక్కడైతే వస్తువు కొనుగోలు చేస్తామో ఆ కోర్టులోనే కేసు వేయాల్సి ఉండేదని ప్రస్తుత కొత్త చట్టం ప్రకారం, వినియోగదారుడు ఎక్కడ నివసిస్తుంటే అక్కడి నుండే ఆన్ లైన్ లో కేసు ఫైల్ చేసుకునే సౌకర్యం ఏర్పడిందన్నారు. కోర్టు విచారణలకు స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చునన్నారు.

బిస్ కేర్ యాప్ ద్వారా హాల్‌మార్క్, క్వాలిటీ కంట్రోల్ వంటి అంశాలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ-జాగృతి యాప్ ద్వారా కేసు ప్రస్తుత స్థితి, ట్రాకింగ్, ఆన్ లైన్ లో ఫీజుల చెల్లింపు తదితరమైనవి ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం, జిల్లా కోర్టులో పరిహారం ఎంతైనా అడగవచ్చు కానీ, ఆ వస్తువు లేదా సేవ కోసం చెల్లించిన విలువ (Consideration) రూ.50 లక్షల లోపు ఉండాలన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వస్తువులను కొనేవారు మాత్రమే వినియోగదారులు అవుతారన్నారు. వ్యాపార లావాదేవీల కోసం (Commercial Purpose) వస్తువులు కొనేవారు ఈ చట్టం పరిధిలోకి రారన్నారు. ఫిర్యాదు చేసిన 21 రోజుల్లోపు సిసి (కన్జ్యూమర్ కంప్లైంట్) నంబర్ ఇవ్వకపోతే, అది ఆమోదించబడినట్లుగా (Deemed to be approved) పరిగణించబడుతుందని ఢిల్లీ రావు తెలియజేశారు.

పౌర సరఫరాల సంస్థ సంచాలకులు ఆర్.గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బంగారు దుకాణాల్లో 1mg (ఒక మిల్లీగ్రామ్) స్కేల్ ఖచ్చితత్వాన్ని అమలు చేయడం ఒక గొప్ప విజయమని, దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. యూరోపియన్ దేశాలతో పోలిస్తే భారతదేశంలో వినియోగదారుల అవగాహన ఇంకా పెరగాల్సి ఉందన్నారు. పాఠశాలల్లో కన్జ్యూమర్ క్లబ్‌ల ద్వారా విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని, డైరెక్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని అభినందించారు. వినియోగదారులు తమకు అన్యాయం జరిగినప్పుడు బిల్లులు, వోచర్లు వంటి ప్రాథమిక ఆధారాలతో కేసు ఎలా ఫైల్ చేసుకోవాలో, ఆ విషయంలో జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ సమాజంలో మనం ఏ వృత్తిలో ఉన్నా మనందరం వినియోగదారులమేనని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను గురించి తెలుసుకోవాలన్నారు. వినియోగదారుడు ప్రశ్నించే హక్కును కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో డిజిటల్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయని, దీనిపై వినియోగదారులు అవగాహన కల్గి ఉండాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని, అప్పుడే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

బిస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) డైరెక్టర్ ప్రేమ్ సజానీ పట్నాలా మాట్లాడుతూ, వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు హాల్ మార్క్ క్వాలిటీ కంట్రోల్ వంటి అంశాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే బిస్ కేర్ యాప్ లో ఉచితంగా ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ప్రతి వినియోగదారుడు తూకాల మోసాలను ప్రశ్నించినప్పుడే వ్యాపారస్థులు భయానికి గురై మోసానికి పాల్పడరన్నారు.

కార్యక్రమం అనంతరం వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించే పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, సివిల్ సప్లైస్ అదనపు సంచాలకులు కె. రంగ కుమారి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏ.పాపారావు, ఏఎస్వో వేంపాటి శ్రీనివాసులు, విద్యార్థులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.

Tags:    

Similar News