రుషికొండ ప్యాలెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం

రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు.

Update: 2025-12-24 11:17 GMT

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను వినియోగించాలని భావిస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశం బుధవారం సచివాలయం రెండో బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, పర్యాటక శాఖ అధికారులు శ్రీనివాస్, ఈశ్వరయ్యలు రుషికొండ ప్యాలెస్ కు సంబంధించిన వివరాలు కమిటీకి వివరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని, తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ముందుకొచ్చినట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని తెలిపారు. ప్యాలెస్ లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై మరోసారి ఈనెల 28న ఆన్ లైన్ జీవోఎం మీటింగ్ లో చర్చిస్తామన్నారు.ఆ సమావేశంలో వచ్చే తుది ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నామన్నారు.

అంతిమంగా హాస్పిటాలిటీ వైపు మొగ్గు చూపుతూ వయబుల్ మోడ్ లో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సబ్ కమిటీ పేర్కొంది. బీచ్ ఫ్రంట్ వినియోగంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను అనుసరిస్తే బాగుంటుందని చర్చించామన్నారు. గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రులు విమర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రుషికొండ ప్యాలెస్ ను హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కానీ కొంతమంది రుషికొండ కింద ఉన్న 9 ఎకరాలు హోటల్స్ కోసం అదనంగా అడిగారని తెలిపారు. సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణం చేయకూడదని తెలిసిందన్నారు. మిగిలిన 2 ఎకరాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో చర్చించామన్నారు. రుషికొండ ప్యాలెస్ లోని చివరి రెండు బ్లాక్ లు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, ఇతర అవసరాల కోసం ఉంచుతామన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. ఇవాళ జరిగిన భేటీలో పర్యాటక శాఖ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని ఆదేశించామని నివేదిక వచ్చిన అనంతరం తదుపరి భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మూడవ మంత్రివర్గ ఉపసంఘ భేటీ జరిగిందన్నారు. ప్రస్తుతం రుషికొండ ప్యాలెస్ పై తలబద్దలు కొట్టుకోవడానికి గత ప్రభుత్వ దుర్మార్గం కారణమైందన్నారు. 

Tags:    

Similar News