వారికి ఇక మూడినట్టే..

Update: 2019-12-13 11:47 GMT

దిశ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. చిన్న పిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయని చెప్పారు. దారుణ ఘటనలు నివారించాలంటే విప్లవాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచి వేసిందన్నారు, హత్యాచార నిందితులకు తక్షణమే శిక్ష వేయాలని అందరు కోరుకుంటున్నారని, దిశ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందని జగన్ తెలిపారు.

సినిమాల్లో అత్యాచారం చేసినవారిని తుపాకీతో కాల్చి చంపితే చప్పట్లు కొడతామని, తెలంగాణలో అదే పనిచేసిన పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎన్‌హెచ్‌ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు మొదలయ్యాయని, హత్యాచారం తప్పు అయినా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులది తప్పు అని మాట్లాడటమేంటన్నారు. అదే జరిగితే శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ముందుకు రావన్నారు. అప్పుడు దేశంలో హత్యాచారాలు పెరిగి అరాచకాలు పెచ్చరిల్లుతాయని జగన్‌ పేర్కొన్నారు.

మనిషి రాక్షసత్వానికి పాల్పడితే త్వరగా న్యాయం కావాలని కోరుకుంటామని జగన్ తెలిపారు. నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లయినా హత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడలేదని చెప్పారు. చట్టాల్లో మార్పు వస్తేనే ప్రభుత్వాలను ప్రజలు నమ్ముతారని బాధితులకు సత్వరమే న్యాయం అందించడానికి దిశ బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. 13 జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హత్యాచార ఘటనల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే మరణశిక్షలు తప్పవన్నారు. 7రోజుల్లో దర్యాప్తు, 21రోజుల్లోనే విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడితే జీవిత ఖైదు తప్పదని జగన్‌ హెచ్చరించారు.

Tags:    

Similar News