వేంకటేశుని ఉచిత దర్శన భాగ్యం ఎన్నడో..?

Update: 2020-08-28 05:19 GMT

Devotees waiting for sarva darshan: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉచిత దర్శనాల ఊసే కనిపించటం లేదు. లాక్ డౌన్‌తో ఉచితానికి తెరదించేసిన అధికారులు పరిస్థితులు మారుతున్నా ఆ దిశగా ఆలోచన చేయడం మానేసారు. ఒక్క దర్శనమే కాదు ఏడుకొండలెక్కితే అన్నింటికీ ఎంతో కొంత సొమ్ము చెల్లించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో దర్శనాలకు దూరమైన సాధారణ భక్తులు సర్వ దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్‌తో ఏడుకొండలపై పరిస్థితులు మారిపోతున్నాయి. ఆలయంలో సర్వదర్శనాలు నిలిపివేయటంతో సాధారణ భక్తులు శ్రీవారి దర్శనానికు వెళ్లలేకపోతున్నారు. సాధారణంగా తిరుమల కొండకు వచ్చే వారిలో 90 శాతం మంది భక్తులు ఉచిత దర్శనాలు చేసుకునే వారు. అయితే కొవిడ్ కేసుల కారణంగా సర్వదర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

జూలై 14న తిరుపతిలో రెండో విడత లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి తీసుకురావటంతో జూలై 15 నుంచి ఉచిత దర్శనాలను టీటీడీ నిలిపేసింది. ఆ తర్వాత నగరంలో ప్రతి 15రోజులకోసారి లాక్‌డౌన్‌ ను సడలిస్తూ వచ్చారు‌. ప్రస్తుతం రాత్రి వేళల్లో మాత్రమే ఆంక్షలున్నాయి. అయినా టీటీడీ ఉచిత దర్శనం ఊసెత్తటం లేదు. ఈ నెల చివరి వరకు తిరుపతిలో లాక్ డౌన్ కోనసాగిస్తూండడంతో అప్పటి వరకు సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభించే అవకాశాలు కనపడడం లేదు.

సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన నాటి నుంచి శ్రీవారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. శ్రీవారికి లభిస్తున్న హూండి ఆదాయం కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే వెసులుబాటు ఉన్నా దీనిపై అధికారులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ నెల 29న టీటీడి పాలకమండలి సమావేశం జరుగుతుండటంతో సర్వ దర్శనం టోకెన్ల జారీపై నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు భక్తులు.


Tags:    

Similar News