మరో రెండు విభాగాలను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణా విభాగాన్ని మంత్రి మేకపాటికి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక విభాగాలను నిర్వహిస్తున్నారు. కాగా కొత్త శాఖల కేటాయింపులపై సీఎంతో చర్చించేందుకు మంత్రి గౌతమ్ రెడ్డి తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయానికి శుక్రవారం వెళ్లారు.. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అదనపు బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణా విభాగం ద్వారా వినూత్న కార్యక్రమాలను అమలు చేసి ప్రభుత్వంపై యువతకు విశ్వాసాన్ని పెంచేలా కృషి చేస్తానని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కేబినెట్‌లో ఐటీ మంత్రిగా అవకాశం పొందారు.