E-Raksha Bandhan: ఈ- రక్షాబంధన్ ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2020-08-03 09:19 GMT

E-Raksha Bandhan: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడానికి, వారికి భరోసా ఇవ్వడానికి మరో వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు కానుకగా "ఈ- రక్షాబంధన్" కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ-రక్షాబంధన్ ప్రారంభించడానికి ముందు ఆసరా, చేయూత వంటి మహిళలకు సాధికారత కల్పించే కార్యక్రమాలకు ఉపయోగపడే కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడించారు.

ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గేంబుల్, అమూల్ వంటి సంస్థల సహకారంతో బ్యాంకుల ద్వారా ప్రతి ఇంట్లో ఓ మహిళకు నాలుగేళ్ల పాటు నికర ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక ఈ-రక్షాబంధన్ లోగో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ-రక్షాబంధన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ ఎలాగన్నదానిపై నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిపై మహిళలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు ఉంటాయని అన్నారు. అందుకోసం 4ఎస్ 4యూ అనే పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా అక్కాచెల్లెమ్మలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ- రక్షాబంధన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడదల రజిని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సీఎం జగన్‌కు రాఖీ కట్టారు.

Tags:    

Similar News