ఘోర ప్రమాదం: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలం దోనేపూడి వద్ద శుక్రవారం (నేడు) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఘోర ప్రమాదం: పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలం దోనేపూడి వద్ద శుక్రవారం (నేడు) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరికాయల లోడుతో ప్రయాణిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిని చింతమోటు గ్రామానికి చెందిన చాట్రగడ్డ కాంతారావు (48), పెసర్లంకకు చెందిన శ్రీనివాసరావు (55), షేక్ ఇస్మాయిల్ (55) గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.