Atchem Naidu: ముగిసిన అచ్చెన్నాయుడు క‌స్ట‌డీ‌.. నిర్దోషిత్వం బయటపడుతుందన్న లాయర్..

Update: 2020-06-28 03:23 GMT
Atchem Naidu (File Photo)

Atchem Naidu: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లో మూడు రోజులపాటు మొత్తం 12.30 గంటలు పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. దీంతో ఏసీబీ విచారణ శనివారంతో ముగిసింది.

శనివారం విచారణలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ నిర్వాహకులతో సంబంధం? టెండరు ఇస్తే వ్యక్తిగత లబ్ధికి సంస్థ యాజమాన్యం ఏమైనా ఆఫర్‌ ఇచ్చిందా? అని ఏసీబీ అధికారులు గుచ్చిగుచ్చి అడిగినట్లు తెలుస్తోంది. సిఫార్సు లేఖలు, ఆ సంస్థతో అచ్చెన్న, ఆయన ఓఎస్‌డీలకు ఉన్న సంబంధాలపైనే ఏసీబీ ఆరా తీసింది. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు అవసరమైన సేవలకు పరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి సరఫరా చేసి మంచి సేవలు అందిస్తున్నామని టెలీహెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ.. ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించిన మీదటే అధ్యయనం చేయాలని, సిఫార్సు లేఖ ఇచ్చానని అచ్చెన్నాయుడు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ సంస్థ నుంచి ఎవరెవరు లబ్ధి పొందారు. ఎంతెంత వాటాలుగా తీసుకున్నారని ప్రశ్నించగా.. ఆ కంపెనీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని, సేవలు అందిస్తామని ముందుకు రావడం వల్లే తాను సిఫార్సు లేఖ ఇచ్చానని అచ్చెన్నాయుడు చెప్పారని తెలుస్తోంది.

విచారణ ముగిసిందని నివేదిక ఆదివారం కోర్టుకు అందజేస్తామని ఏసీబీ వర్గాలు తెలియజేశాయి. అయితే మూడు రోజుల విచారణలో అచ్చెన్నాయుడితో బలవంతంగా తప్పు చేసినట్లు ఒప్పించే ప్రయత్నం చేశారని అచ్చెన్నాయుడి తరఫు లాయర్ హరిబాబు వివరించారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు కి ఎలాంటి సంబంధం లేదని, తుది తీర్పులో ఆయన నిర్దోషిత్వం బయటపడుతుందని లాయర్ అన్నారు. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు అచ్చెన్నాయుడి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


Tags:    

Similar News