Tomato: టమాట రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గతంలో కేవలం ఒక్క టమాటా 10 రూపాయలు పలికిన మార్కెట్లోనే నేడు కిలో రూపాయి రెండు రూపాయలు పలుకుతోంది. కేవలం ఒక్క ఎకరా టమాటా పంటవేసి లక్షలు సంపాదించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 10,20 ఎకరాల్లో టమాటాలు పండించిన రైతులు కూడా కనీసం పది, ఇరవై వేలు కళ్లజూసే పరిస్థితి లేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల కింద ఆకాశాన్నంటిన టమాట ధర ఇప్పుడు పాతాళానికి పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం మదనపల్లి. అక్కడి రైతుల ప్రధాన పంట టమాటానే. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ మార్కెట్ కు టమాటాలు తరలిస్తారు. ఇక్కడి నుంచే ఏపీలోని మిగతా ప్రాంతాలతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చెరి ప్రాంతాలకు కూడా టమాటా ఎగుమతి జరుగుతుంది. అలాంటి మార్కెట్లో కిలో టమాటా 5 కంటే ఎక్కువ ధర పలకడం లేదు. దీంతో కనీసం రవాణా ఛార్జీలు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఒక్క మదనపల్లె మార్కెట్లోనే కాదు రాష్ట్రంలోని అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. టమాటా రైతుల పరిస్ధితి, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు సాయం చేసేందుకు ఏపీ సర్కార్ ముందుకు వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టమాటా రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది.
కిలో రూ. 8 చొప్పున వెయ్యి క్వింటాళ్ల టమాటాలను కొనుగోలు చేస్తోంది. రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి రాష్ట్రంలోని పలు రైతు బజార్లలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు వంటి పట్టణాల్లోని రైతు బజార్లలో మార్కెటింగ్ శాఖ ఈ టమాటాల విక్రయాలు చేపట్టనుంది. టమాటా రైతులను ఆదుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటికే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఇలా సేకరించిన టమాటాలను అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు.