లాక్ డౌన్ తర్వాత రోడ్లపైకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు?

మే 17 లాక్ డౌన్ త‌ర్వాత ఏపీలో బ‌స్సులు న‌డ‌పాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని సమాచారం.

Update: 2020-05-11 05:12 GMT

మే 17 లాక్ డౌన్ త‌ర్వాత ఏపీలో బ‌స్సులు న‌డ‌పాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తుంద‌ని సమాచారం.క‌రోనా కార‌ణంగా బ‌స్సుల్లో స‌గం సీట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని బ‌స్సుల్లో సోషల్ డిస్టాన్స్‌లో భాగంగా ఇలా రాబోతున్నాయి. ఈ నెల 18 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది దీంతో 40 నుంచి 50 శాతం చార్జీలు పెంచుతారని సమాచారం. కరోనా కారణంగా... ఆర్టీసీలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి.

బ‌స్సుల్లో ప్ర‌భుత్వం సూచ‌న‌లు ఇలా ఉన్నాయి.

ఏపీలోని 128 డిపోల్లో 800 బస్సుల్లో సీట్లు మార్చేస్తున్నారు. 60 సీట్లున్న పల్లె వెలుగు బస్సుల్లో 34 మందినే ఎక్కనిస్తారు. ఇలా మొత్తం 60 సీట్లలో 26 సీట్లు ఖాళీగా ఉంటాయి. ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరు కూర్చుంటారు. మధ్య సీటు ఖాళీగా ఉంటుంది. ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరికే అవ‌కాశం ఉంది. 40 శాతం టికెట్ రేట్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది. అందనంగా ఒక్క ప్రయాణికుణ్ని/ప్రయాణికురాలిని కూడా ఎక్కించుకోరు.

సూపర్‌లగ్జరీ బస్సులో 36 సీట్లు ఉంటాయి. వాటిలో 18 సీట్లు తీసేస్తున్నారు. మధ్య ఖాళీ భాగంలో 8 సీట్లు అమర్చుతున్నారు. ఇకపై ఈ బస్సుల్లో 26 మంది ప్ర‌యాణించ‌డానికి వీలు ఉంటుంది. ఈ బస్సుల్లో 30 శాతానికి పైగా చార్జీలు పెంచనున్నారు. అల్ట్రా డీలక్స్‌లో 12 సీట్లు తగ్గిపోతాయి.

మ‌రోవైపు సోషల్ డిస్టాన్సింగ్ కార‌ణంగా బ‌స్సులో కండక్టర్లు ఉండరు. బస్సులో హ్యాండ్ శానిటైజర్ తప్పనిసరిగా ఉంటుంది. ప్ర‌యాణికులు ఎక్కిన త‌ర్వాత‌ బస్ డ్రైవర్ చేతిలో హ్యాండ్ శానిటైజర్ డ్రాప్స్ వేస్తారు. అయితే ప్ర‌యాణా చార్జీలు పెంచితే సామాన్యుడిపై భారం ప‌డ‌నుంది. అంతే కాకుండా ప్ర‌భుత్వం అద‌న‌పు చార్జీలు భ‌రిస్తే ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ అవుతుంది. దీంతో పౌరుల ర‌క్ష‌ణ కోసం సీట్లు త‌గ్గించి టికెట్ చార్జీలు పెంపు త‌ప్ప‌ద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని తెలుస్తోంది. 

Tags:    

Similar News