1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ..

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గడం లేదు.

Update: 2020-05-14 07:48 GMT

రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సోమవారం ప్రభుత్వానికి 59 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. ఎస్సీఈఆర్టీ పలు అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ఎంత అవసరమో గుర్తించింది. దాంతో ఎస్సీఈఆర్టీ సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది.

అయితే మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయని పేర్కొంది. అయితే ఇందులో కూడా విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని పవేశపెడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఆంగ్ల మాధ్యమంపై గతంలో ఇచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలో తల్లిదండ్రులకు ఆప్షన్‌ ఎంచుకోమని పాఠశాల విద్యాశాఖ కోరింది. అయితే మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు.

Tags:    

Similar News