పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష .. జూన్ నెలాఖరులోగా స్పిల్‌వే పూర్తి..
జూన్ నెలాఖరులోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
జూన్ నెలాఖరులోగా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్షించారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుతో పాటు పునరావాస కార్యక్రమాల పనులను సైతం వేగవతం చేయాలని ఆదేశించారు.
పోలవరంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు వచ్చే అవకాశం ఉండటంతో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే అంశంపై ప్రధానంగా సీఎం జగన్ చర్చించారు. వేసవి కాలంలోనే పనులు వేగంగా చేసేందుకు అవకాశం ఉంటుందని, లాక్‌డౌన్ కారణంగా నెల రోజులుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అధికారులు సీఎంకు వివరించారు.
లాక్‌డౌన్ కారణంగా ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించే సిమెంట్, స్టీల్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఏప్రిల్ 20 నుంచి పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన దృష్టిలో పెట్టుకుని సిమెంటు, స్టీల్ సరఫరాకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న అవుకు టన్నెల్-2, వలిగొండ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార-నాగావళి లింకు పనులపైనా సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాది చివరిలో ఈ ఆరు ప్రాజెక్ట్స్ తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు.