తమలపాకు పంటకు కరోనా దెబ్బ

Update: 2020-04-20 10:55 GMT

కరోనా ప్రభావం తమలపాకు పంటలపై పడింది. లాక్ డౌన్ తో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో చేతికొచ్చిన పంట పొలాల్లోనే ముదిరిపోతుంది. లక్షలాది రూపాయలను తమలపాకుల యాజమానులు నష్టపోతుండగా, కూలీల ఉపాధికి గండిపడుతుంది.

విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని ధర్మవరం, వమ్మవరం, పెనుగొల్లు, సోముదేవపల్లి తదితర గ్రామాలలో సుమారు 100 ఎకరాలలో తమలపాకు తోటలను రైతులు సాగుచేస్తున్నారు. సున్నితమైన ఈ తోటలను ఆగస్ట్ నెల నుండి జనవరి వరకూ చంటిపిల్లను సాకిన విధంగా సాగుచేస్తే ఫిబ్రవరి నుండి జూన్ నెలాఖరు వరకూ పంట దిగుబడినిస్తుంది. పండిన పంటను బుట్టలలో ప్యాక్ చేసి హైదరాబాద్ , కలకత్తా , విశాఖపట్నం, పూణే తదితర ప్రాంతాలకు రైళ్ళు , బస్సుల ద్వారా ఎగుమతి చేస్తుంటారు.

కరోనా నేపథ్యంలో గత మార్చి నుంచి దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్నందున రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పాన్ షాప్ లు బంద్ అయ్యాయి. శుభ కార్యాలు వాయిదాపడ్డాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో పండిన తమలపాకు పంటలను తుంచకుండా తోటలలోనే ఉంచివేయడంతో ఆకులన్నీ ముదిరిపోయి , కుళ్ళిపోతున్నాయి.

ఎకరా తమలపాకు పంటకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు పెట్టుబడి వ్యయంతో పాటు, కౌలుగా మరో ముప్పయి వేలు రూపాయలు రైతులు చెల్లిస్తారు. లాక్ డౌన్ కారణంగా ఎగుమతి లేకపోవడంతో ఆర్దికంగా దెబ్బతిన్న రైతులు అప్పులలో కూరుకుపోతున్నారు. తమలపాకు సాగులో ఎకరానికి 10 మంది కూలీలు పని చేస్తుంటారు. పండిన పంట అలాగే తోటల్లో వుండిపోవడంతో వెయ్యి మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. లాక్ డౌన్ తో తమలపాకు రైతులు దిక్కుతోచని స్థితిలో వున్నారు.

తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదట నష్టపోయేది తమలపాకు రైతులే. హార్టీ కల్చర్ విభాగంకి చెందిన తమలపాకు సాగుపట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవరిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తమలపాకు రైతులకు ప్రభుత్వం ప్రత్యేక నష్టపరిహారం ఇవ్వాలని రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పండిన తమలపాకుల పంటను ఏం చేయాలో తెలియక రైతులు తల పట్టుకుంటున్నారు. 

Tags:    

Similar News