Anakapalli: అనకాపల్లి రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ!

Anakapalli: జీవీఎంసీ మేయర్ రేసులో వైసీపీ తరఫున మాజీ ఎంపీ బిశెట్టి సత్యవతి పేరు పరిశీలనలో ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 3 Oct 2026 10:24 AM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ!

Anakapalli: జీవీఎంసీ మేయర్ పదవిపై రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై అనకాపల్లిలో ఆసక్తికరమైన రాజకీయ చర్చ సాగుతోంది. వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బిశెట్టి సత్యవతి పేరును పరిశీలిస్తున్నారంటూ స్థానికంగా ప్రచారం ఊపందుకుంది.

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బిశెట్టి సత్యవతి.. ఎంపీగా పనిచేశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, తన వైద్య వృత్తి ద్వారా కూడా ప్రజలకు చేరువగా ఉన్నారనే గుర్తింపు ఆమెకు ఉంది.

అయితే 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి లోక్‌సభ స్థానానికి ఆమెకు పార్టీ టికెట్ దక్కలేదు. ప్రస్తుతం ఇదే అంశం కూడా మేయర్ అభ్యర్థిత్వ చర్చలో ప్రస్తావనకు వస్తోంది. గతంలో పార్టీ కోసం ఆమె చేసిన కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్న పరిచయం, వైద్య వృత్తి ద్వారా ప్రజలతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఆమెకు అనుకూలంగా మారే అవకాశాలపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

అయితే బిశెట్టి సత్యవతిని జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఆమె పేరు మేయర్ అభ్యర్థిత్వంపై వినిపిస్తున్న ప్రచారంగానే రాజకీయ వర్గాలు పరిగణిస్తున్నాయి.

జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో మేయర్ పదవిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్న వేళ.. వైసీపీ నుంచి బిశెట్టి సత్యవతి పేరు తెరపైకి రావడం అనకాపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరి ఈ ప్రచారానికి వైసీపీ అధిష్టానం అధికారిక ముద్ర వేస్తుందా..?

లేక మేయర్ రేసులో మరో పేరు తెరపైకి వస్తుందా..?

అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI