Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర!

Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi Breaks Sachin Tendulkar's Record. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు.

Rishvik
Published on: 4 July 2026 8:14 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం ఎట్టకేలకు వచ్చింది. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్.. భారత జట్టు తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రంతో బుడ్డోడు భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచి.. దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

అత్యంత చిన్న వయసులో అరంగేట్రం:

ఇప్పటివరకు భారత పురుషుల క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (16 సంవత్సరాలు 205 రోజులు) ఉన్నాడు. ముప్పై ఏళ్ల సచిన్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత షెఫాలీ వర్మ (15 సంవత్సరాలు 239 రోజులు) పేరిట ఉండేది. ఇప్పుడు వైభవ్ ఈ ఇద్దరినీ అధిగమించి.. భారత పురుష, మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు.

తిలక్ వర్మ చేతుల మీదుగా:

ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల కోసం భారత జట్టులో ఎంపికైనప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌ల్లో వైభవ్‌కు అవకాశం రాలేదు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో భారత్ ఓడిపోవడం, ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ సంజు శాంసన్ విఫలం కావడంతో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. చివరకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకుని.. రెండో టీ20లో అతడికి అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు. మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ డెబ్యూ క్యాప్ అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఐపీఎల్ 2026 ప్రదర్శనతోనే:

టాస్ సందర్భంగా మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వైభవ్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. 'గత కొన్ని నెలలుగా వైభవ్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడో అందరూ చూశారు. అతడు ఎలాంటి ఒత్తిడిని తీసుకోడు. నెట్స్‌లో బౌలర్లపై దూకుడుగా ఆడే తీరు అతడి ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. అతడు జట్టులో చోటుకు పూర్తిగా అర్హుడు' అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి.. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలతో పాటు మొత్తం 72 సిక్సర్లు బాదుతూ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.

మారియన్ ఘెరాసిమ్ రికార్డు:

ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన త్రిదేశాల టోర్నీలో కూడా వైభవ్ తన సత్తా చాటాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేసి.. శ్రీలంక-ఏపై కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన పురుష క్రికెటర్‌గా పాకిస్థాన్‌కు చెందిన హసన్ రజా (14 సంవత్సరాలు 227 రోజులు) కొనసాగుతుండగా.. మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రొమేనియాకు చెందిన మారియన్ ఘెరాసిమ్ (14 సంవత్సరాలు 16 రోజులు) రికార్డు ఉంది.

భారత పురుషుల క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:

వైభవ్ సూర్యవంశీ – 15 సంవత్సరాలు 99 రోజులు

సచిన్ టెండూల్కర్ – 16 సంవత్సరాలు 205 రోజులు

పీయూష్ చావ్లా – 17 సంవత్సరాలు 75 రోజులు

లక్ష్మణ్ శివరామకృష్ణన్ – 17 సంవత్సరాలు 118 రోజులు

పార్థివ్ పటేల్ – 17 సంవత్సరాలు 152 రోజులు

మణీందర్ సింగ్ – 17 సంవత్సరాలు 193 రోజులు

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story