Krishna Devotion Story: ఇలాంటి భక్తి ఉంటే వజ్రాలేంటి... ఆ భగవంతుడు కూడా ఇంటికి వచ్చేస్తాడు
శ్రీకృష్ణుడిపై నిష్కల్మషమైన భక్తి ఉంటే వజ్రవైఢూర్యాల కంటే గొప్ప ఆనందం లభిస్తుంది. పండ్లమ్మాయి కథ ద్వారా నిజమైన భక్తి, దైవప్రేమ, ఆధ్యాత్మిక విశ్వాసం అందించే సందేశం గురించి తెలుసుకుందాం.
Krishna Devotion Story: దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమించే భక్తుడికి సంపదల మీద ఆశ ఉండదు. స్వామి సాన్నిధ్యం ఒక్కటి లభిస్తే చాలని కోరుకుంటాడు. అలాంటి నిష్కల్మషమైన భక్తి ముందు వజ్రవైఢూర్యాలు కూడా దిగదుడుపే. శ్రీకృష్ణుడికి, ఆయన భక్తులకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే ఓ చక్కని కథలో ఇదే ఆధ్యాత్మిక సత్యం కనిపిస్తుంది. రోజూ పూజలు చేస్తున్నాం.. దేవుడి నామాన్ని జపిస్తున్నాం.. పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. అయినా మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు. అప్పులు ఎలా తీరాలి? పిల్లలకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? కుటుంబ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయి? ఇలా కోరికలు, ఆందోళనల మధ్య చేసే పూజలో మనసు పూర్తిగా భగవంతుడిపై నిలవడం కష్టమే. మరి నిజమైన భక్తి అంటే ఏమిటి? భగవంతుడిని ప్రేమించాలా? ఆయన నుంచి ఏదైనా పొందాలని కోరుకోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కృష్ణయ్య కథను తెలుసుకుందాం.
కన్నయ్య కోసం ఎదురుచూసిన పండ్లమ్మాయి
ఒక గ్రామంలో ఓ యువతి ప్రతిరోజూ పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేది. ఆర్థికంగా పెద్దగా స్థోమత లేకపోయినా, శ్రీకృష్ణుడిపై ఆమెకు అపారమైన ప్రేమ ఉండేది. పండ్ల బుట్టను తలపై పెట్టుకొని వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఆమె మనసులో ఒకటే కోరిక ఉండేది. తన కన్నయ్య ఎప్పుడైనా వచ్చి తన దగ్గర పండు తీసుకుంటే ఎంత బాగుంటుందోనని అనుకునేది. ఆమెకు బంగారం కావాలని లేదు. వజ్రాలు సంపాదించాలని ఆశ లేదు. తన ఇష్టదైవమైన కృష్ణుడిని ఒక్కసారి దగ్గరగా చూడాలని, ఆయనకు తన చేతులతో పండు తినిపించాలని మాత్రమే కోరుకునేది. ఒకరోజు ఎప్పటిలాగే పండ్లు అమ్ముకుంటూ వెళ్తున్న ఆమెకు వెనుక నుంచి ఓ చిన్నారి గొంతు వినిపించింది. “అమ్మా.. నీ దగ్గర పండ్లు బాగున్నాయా?” అని ఆ బాలుడు అడిగాడు.
ఆ మాట వినగానే ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆ చిన్నారి ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ కనిపించింది. అతడిని చూడగానే ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. తన కన్నయ్యే వచ్చాడన్న భావనతో పండ్ల బుట్టను కింద పెట్టి, ఆ బాలుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. “నాయనా.. నీకు ఎన్ని పండ్లు కావాలో చెప్పు” అంటూ ఒక్కొక్క పండును అతడి చేతికి అందించింది. బాలుడు కూడా ఎంతో ఇష్టంగా పండ్లన్నీ తిన్నాడు. ఆమె ప్రేమకు హద్దులు లేవు. చివరకు బుట్టలోని పండ్లన్నీ అయిపోయాయి. “నేను ఒక్క పండే అడిగాను. నువ్వేమో బుట్టలో ఉన్నవన్నీ ఇచ్చేశావు!” అని ఆ బాలుడు చిరునవ్వుతో అన్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఖాళీ బుట్టలో కనిపించిన అద్భుతం
ఆ బాలుడు వెళ్లిపోయినా యువతి మనసు మాత్రం అతడి దగ్గరే ఉండిపోయింది. తన కన్నయ్యకు పండ్లు తినిపించానన్న ఆనందంలో కొంతసేపు అక్కడే కూర్చుండిపోయింది. సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్న సమయంలో ఆమెకు ఇంటికి వెళ్లాలన్న విషయం గుర్తుకొచ్చింది. ఖాళీ అయిన బుట్టను తలపై పెట్టుకోబోయింది. అయితే అది మామూలు బుట్టలా కాకుండా చాలా బరువుగా అనిపించింది. ఆశ్చర్యంతో లోపలికి తొంగిచూసింది. అందులో మెరిసిపోతున్న వజ్రవైఢూర్యాలు కనిపించాయి! తనకు ఎదురైన బాలుడు సాధారణమైన పిల్లవాడు కాదని, తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడే తన ప్రేమను స్వీకరించడానికి వచ్చాడని ఆమె భావించింది. ఆమెకు ఆ రత్నాలను చూసి ఆశ కలగలేదు. కన్నయ్య తన దగ్గరకు వచ్చాడన్న అనుభూతే అపారమైన ఆనందాన్ని ఇచ్చింది.
వజ్రాల కంటే కన్నయ్యే ముఖ్యం
ఇంటికి వెళ్లాలంటే ఆమె యమునా నదిని దాటాలి. అప్పటికే చీకటి పడింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తలపై రత్నాలతో నిండిన బుట్టను పెట్టుకొని నదిని దాటడం కష్టమని ఆమెకు అనిపించింది. అయితే ఆ క్షణంలో ఆమె మనసులో ఓ ఆలోచన వచ్చింది. తనకు కావలసింది ఈ రత్నాలు కావు.. తన కన్నయ్య ప్రేమ ఒక్కటి చాలు అని భావించింది. బుట్టలోని రత్నాలను యమునలో విడిచిపెట్టి, ఖాళీ బుట్టతో నదిని దాటిందని ఈ కథ చెబుతుంది. ఈ కథలోని అసలు సందేశం సంపదను వదిలేయాలని చెప్పడం కాదు. మన జీవితంలో భగవంతుడికి ఇచ్చే స్థానం ఏమిటన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం. అవసరాల కోసం దేవుడిని ప్రార్థించడం సహజం. కానీ కోరికలు నెరవేరినప్పుడే భక్తి, నెరవేరనప్పుడు నిరాశ అనే భావన నుంచి బయటపడాలి.
నిజమైన భక్తి అంటే మనసును స్వామికి దగ్గర చేయడం. మనకు లభించిన దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం. సంపద ఉన్నా లేకపోయినా మనశ్శాంతిని కాపాడుకోవడం. వజ్రవైఢూర్యాలు జీవితానికి విలువను ఇవ్వవచ్చు. కానీ భగవంతుడిపై నిష్కల్మషమైన ప్రేమ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. మనం చేసే పూజలో కోరికలతో పాటు ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞత కూడా ఉండాలి. ఎందుకంటే మనసులో కన్నయ్యకు స్థానం కల్పించినప్పుడు, ఆయన స్మరణే మనకు గొప్ప సంపదగా మారుతుంది.




