వాయుసేన పవర్ తగ్గించొద్దు.. ఐఏఎఫ్ చీఫ్ వార్నింగ్
భారత సాయుధ దళాలలో ప్రతిపాదిత అత్యంత కీలకమైన సైనిక సంస్కరణ 'థియేటరైజేషన్' (Theaterisation) పై భారత వాయుసేన (IAF) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ
IAF Chief AP Singh
భారత సాయుధ దళాలలో ప్రతిపాదిత అత్యంత కీలకమైన సైనిక సంస్కరణ 'థియేటరైజేషన్' (Theaterisation) పై భారత వాయుసేన (IAF) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటరైజేషన్ పేరుతో యుద్ధ విమానాలను ప్రాంతాల వారీగా భౌగోళికంగా శాశ్వతంగా విభజించడాన్ని ఐఏఎఫ్ సమర్థించదని ఆయన స్పష్టం చేశారు. వేరే దేశాల నమూనాలను గుడ్డిగా అనుకరించకుండా, భారతదేశపు భౌగోళిక, వ్యూహాత్మక భద్రతా అవసరాలకు తగినట్లుగానే ఈ సైనిక నిర్మాణాన్ని రూపొందించాలని పిలుపునిచ్చారు.
కేంద్రీకృత నియంత్రణే వాయుసేన బలం
న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. ఎయిర్ పవర్ ముఖ్య బలాలు వేగం, చేరువ (reach), సరళత (flexibility) , అవసరమైన చోట యుద్ధ శక్తిని వేగంగా కేంద్రీకరించడమేనని తెలిపారు. "ఒక యుద్ధ విమానం అది ఉన్న భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదు. గాలిలోనే ఇంధనాన్ని నింపుకునే సదుపాయం, సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, నెట్‌వర్క్ సెన్సార్ల ద్వారా ఎంత దూరం నుంచైనా వైమానిక దళాన్ని శత్రువుపైకి ప్రయోగించవచ్చు. అందుకే అవసరమైన చోట 'కేంద్రీకృత నియంత్రణ' (Centralised Control), అనుకూలమైన చోట 'వికేంద్రీకృత అమలు' (Decentralised Execution) అనే సూత్రమే ప్రధాన మార్గదర్శకంగా ఉండాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
'ఆపరేషన్ సింధూర్' అనుభవాలే నిదర్శనం
ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' అనుభవాలను ప్రస్తావిస్తూ.. త్రివిధ దళాల అధిపతులమ్మిన సంయుక్త నిర్వహణ వ్యవస్థ ద్వారా వనరులను సరైన సమయంలో సరిగ్గా కేటాయించడం వల్లే విజయం సాధ్యమైందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న యుద్ధాలలో వైమానిక శక్తి ఏ స్థాయిలో మిలిటరీ ఫలితాలను శాసిస్తుందో స్పష్టమైందని, అందుకే వాయుసేనను ఎలా పునర్వ్యవస్థీకరిస్తున్నామనేది అత్యంత కీలకమైన అంశమని అన్నారు. ఆపరేషనల్ సన్నద్ధతకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ మార్పులను దశలవారీగా చేపట్టాలని సూచించారు.
ఏంటి ఈ థియేటరైజేషన్ ప్రణాళిక?
2019లో ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక సైనిక సంస్కరణల ప్రకారం.. సైన్యం (Army), నావికాదళం (Navy), వాయుసేన (IAF) లను ఒకే కమాండ్ కిందకు తీసుకువచ్చి యుద్ద సమయాల్లో సంయుక్తంగా నిర్వహించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రతిపాదించిన నమూనా ప్రకారం.. ఉత్తర థియేటర్ కమాండ్ (లక్నో).. చైనా సరిహద్దుల పర్యవేక్షణకు. పశ్చిమ థియేటర్ కమాండ్ (జైపూర్): పాకిస్థాన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు. మారినైమ్ (సముద్ర) థియేటర్ కమాండ్ (తిరువనంతపురం): సముద్ర తీర భద్రత కోసం. అయితే కమాండ్ నిర్మాణాలపై త్రివిధ దళాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం, ముఖ్యంగా తమ ఫైటర్ స్క్వాడ్రన్లను ముక్కలుగా విభజించడంపై వాయుసేన రిజర్వేషన్లు వ్యక్తం చేయడంతో ఈ ప్రణాళిక ప్రక్రియ నెమ్మదించింది.
కలసికట్టుగా భవిష్యత్ యుద్ధాలకు సన్నద్ధం
భవిష్యత్ యుద్ధభూమి ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని, రాబోయే రోజుల్లో యుద్ధాలు మరింత వేగంగా, నెట్‌వర్క్ ఆధారితంగా , డేటా ఆధారంగా సాగుతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉతుందని, మిగిలిన రెండు దళాలతో కలిసి భారతదేశానికి సరిపోయే సొంత నమూనాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశం తరఫున ఐక్యంగా పోరాడేలా బలమైన సైనిక వ్యవస్థను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.




