Bigg Boss 10: నీతూని నిలదీసిన షాలినీ.. రోహిత్ టాపిక్‌తో మరోసారి హౌస్‌లో గొడవ

బిగ్ బాస్ తెలుగు 10 పదకొండో వారం నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చి హౌస్‌మేట్స్‌ను టార్గెట్ చేశారు. షాలినీ నీతూని, అపూర్వ వర్షిణిని, ఝాన్సీ దేబ్జానీని నామినేట్ చేయగా, త్రిగుణ్ శివ్, వంశీ పేర్లు చెప్పాడు.

CR Reddy
Published on: 17 Nov 2026 7:26 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారం నామినేషన్లు ఆసక్తికరంగా సాగాయి. ఈసారి నామినేషన్ల బాధ్యతను మాజీ కంటెస్టెంట్లకు అప్పగించాడు బిగ్ బాస్. షాలినీ, మిథిలేష్, దక్షి, అపూర్వ, ఝాన్సీ ఇంట్లోకి వచ్చి తమకు నచ్చని హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. అంతేకాదు.. వారు ఇచ్చిన డ్యాగర్ల ద్వారా ఇంట్లో ఉన్న మరో కంటెస్టెంట్‌కు కూడా నామినేషన్ చేసే అవకాశం కల్పించారు. దీంతో పాత గొడవలు, స్నేహాలు, వ్యక్తిగత విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. మొదటగా ఇంట్లోకి వచ్చిన షాలినీ.. నీతూని నామినేట్ చేసింది. ఆటలో ఏడవడం, అరవడం తప్ప పెద్దగా ఏమి చేయడం లేదని విమర్శించింది. వంట బాగా చేస్తాడని కెప్టెన్‌ను చేస్తారా? నామినేషన్లకు భయపడుతున్నారని ప్రశ్నించింది. దీనికి నీతూ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. బయట ప్రేక్షకులను మెప్పించలేకే షాలినీ ఎలిమినేట్ అయిందని కౌంటర్ వేసింది. రోహిత్ విషయంలోనూ షాలినీ నీతూని ప్రశ్నించింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి మధ్య తప్పు ఉంటే అమ్మాయినే ఎందుకు నిలదీస్తున్నావని అడిగింది. రోహిత్ కుటుంబ సభ్యులే తనకు ఫోన్ చేసి చెప్పారని నీతూ సమాధానమిచ్చింది. చివరికి షాలినీ ఇచ్చిన డ్యాగర్‌తో త్రిగుణ్.. శివ్‌ను నామినేట్ చేశాడు.

శివ్‌ను నామినేట్ చేసిన త్రిగుణ్

శివ్‌ను నామినేట్ చేస్తూ త్రిగుణ్ పలు కారణాలు చెప్పాడు. గేమ్‌లో తాను ఎక్కువ స్కోర్ చేసినా, త్యాగం చేశానని శివ్ చెప్పడం సరికాదన్నాడు. స్నేహం పేరుతో తనను మోసం చేశారని ఆరోపించాడు. తన నిర్ణయం వల్ల ఇమ్యూనిటీ వదులుకున్నానని, ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నానని శివ్ వివరణ ఇచ్చాడు. మరోవైపు మిథిలేష్.. ముకేష్‌ను నామినేట్ చేశాడు. ఝాన్సీ విషయంలో ముకేష్ వ్యవహరించిన తీరు, సుధీర్‌తో అతడి స్నేహం గురించి ప్రశ్నించాడు. మిథిలేష్ ఇచ్చిన డ్యాగర్‌తో అమన్ కూడా ముకేష్‌నే నామినేట్ చేశాడు. ఆ తర్వాత దక్షి వచ్చి నీతూని నామినేట్ చేసింది. ఆర్‌కే, ముకేష్‌లపై గతంలో నీతూ చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పింది. నీతూ కూడా తన వాదనను గట్టిగా వినిపించింది. దక్షి ఇచ్చిన డ్యాగర్‌తో త్రిగుణ్.. తన స్నేహితుడైన వంశీని నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు వంశీ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందని కారణం చెప్పాడు.

వర్షిణిపై అపూర్వ విమర్శలు

అపూర్వ ఎంట్రీతో వర్షిణి టార్గెట్ అయింది. పది వారాలుగా పెద్దగా ఆట ఆడకుండా కొనసాగుతోందని విమర్శించింది. గతంలో శివ్ గురించి వర్షిణి మాట్లాడిన బీ, పీ పదాలను ప్రస్తావించింది. త్రిగుణ్ కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు రావడాన్ని వర్షిణి తట్టుకోలేకపోయిందని, ముకేష్ మద్దతు లేకపోతే ఆమె ఆట కనిపించేది కాదని వ్యాఖ్యానించింది. దీనికి వర్షిణి కూడా ఘాటుగా స్పందించింది. తాను ప్రేక్షకులకు నచ్చడం వల్లే ఇంట్లో కొనసాగుతున్నానని, అపూర్వలా రెండు వారాలకే బయటకు వెళ్లలేదని కౌంటర్ ఇచ్చింది. మాటల మధ్య ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది. అపూర్వ ఇచ్చిన డ్యాగర్‌తో శివ్.. రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేశాడు. దేబ్జానీకి ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించడంతో రామ్ ప్రసాద్ కూడా తన వాదన వినిపించాడు.

దేబ్జానీపై ఝాన్సీ ఫైర్

చివరగా వచ్చిన ఝాన్సీ.. దేబ్జానీని నామినేట్ చేసింది. అవసరానికి తగ్గట్టు మాటలు మారుస్తున్నావని, ఆటలో తన వ్యక్తిత్వాన్ని చూపించడం లేదని విమర్శించింది. దీనికి దేబ్జానీ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చింది. బయటకు వెళ్లిపోయినవాళ్లు తనకు ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడింది. ఝాన్సీ ఇచ్చిన డ్యాగర్‌తో ముకేష్.. సుధీర్‌ను నామినేట్ చేశాడు. స్నేహంలో నమ్మకం, కృతజ్ఞత చూపడం లేదని ఆరోపించాడు. తన కోసం ఝాన్సీ, ముకేష్ త్యాగం చేసినా సుధీర్ వాటిని గుర్తించలేదని ఝాన్సీ కూడా ప్రశ్నించింది. ఈ ఆరోపణలతో విసిగిపోయిన సుధీర్.. తప్పు తనదే అయితే ఇంటి నుంచి వెళ్లడానికి సిద్ధమని అన్నాడు. మరోవైపు కుటుంబ సభ్యులు టాప్‌ 5లో ఎవరుండాలని చెప్పిన సమయంలో 13 మంది త్రిగుణ్ పేరును ప్రస్తావించడం కూడా ఇంట్లో చర్చకు దారితీసింది. ఈ నామినేషన్లలో మాజీ కంటెస్టెంట్లు ఎవరూ నేరుగా త్రిగుణ్‌ను నామినేట్ చేయకపోవడం మరో ఆసక్తికర అంశంగా నిలిచింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.