Bigg Boss 10: వర్షిణిని ఏడిపించిన అమన్.. ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్లలో ఉన్న ఆరుగురు వీళ్లే

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉద్విగ్నంగా, వివాదాస్పదంగా సాగింది.

CR Reddy
Published on: 14 Oct 2026 7:21 AM IST
Bigg Boss 10
X

Bigg Boss 10

Bigg Boss 10: బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు అత్యంత ఉద్విగ్నంగా, వివాదాస్పదంగా సాగింది. గత ఎపిసోడ్ ముగింపులో షాలిని దేబ్జానీని నామినేట్ చేయడంతో ఆగిన రచ్చ తాజా ఎపిసోడ్ కు మరింత తీవ్రరూపం దాల్చింది. షాలిని ప్రవర్తన, రోహిత్ ఇచ్చే మద్దతు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లతో జరిగిన గొడవలు ఎపిసోడ్‌ను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా, నాగార్జున క్లాస్ పీకినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడం హౌస్‌మేట్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు, వర్షిణి నామినేషన్ రచ్చ

షాలిని తన రెండో నామినేషన్‌గా వర్షిణి పేరును ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగగా, ఎప్పటిలాగే రోహిత్ వచ్చి షాలినికి సపోర్ట్‌గా గొడవపడ్డాడు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ శివకుమార్‌ను కూడా సెలబ్రిటీల గ్రూప్ అంటూ షాలిని వ్యాఖ్యానించడంతో శివ తీవ్రంగా మండిపడ్డాడు. నామినేషన్ ప్రక్రియలో వైల్డ్ కార్డ్ జడ్జ్ నీతూ మాస్టర్ చివరికి వర్షిణిని నామినేట్ చేయడానికి ఫైనల్ చేశారు. తర్వాతి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి నిర్వహించిన టాస్క్‌లో దేబ్జానీ గెలిచి, రోహిత్‌తో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతోందన్న పాయింట్‌పై షాలినిని నామినేట్ చేసింది. దీంతో షాలిని, దక్షిలతో పాటు నీతూ మాస్టర్‌పై కూడా అదుపులేకుండా అరిచేసింది.

టాస్కుల్లో ఓడిపోయిన వారికి రెండో ఛాన్స్

మరో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రామకృష్ణ నిర్వహించిన టాస్క్‌లో వంశీ గెలిచి షాలినిని నామినేట్ చేశాడు. షాలిని మాట్లాడకుండా అరుస్తూనే ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన బిగ్‌బాస్, నామినేషన్‌ను ఆపేసి మరో పేరు చెప్పమన్నాడు. దీంతో వంశీ ముకేశ్ పేరు చెప్పాడు. ఈ క్రమంలో ఓడిపోయిన వారికి బిగ్‌బాస్ మరో ఛాన్స్ ఇస్తూ మళ్లీ టాస్క్ పెట్టాడు. ఈసారి ఓడిపోయిన వాళ్లు కూడా నేరుగా నామినేట్ అవుతారని కఠిన నిబంధన విధించాడు. ఈ గేమ్‌లో త్రిగుణ్ గెలిచి రోహిత్ గ్రూపిజాన్ని ప్రశ్నిస్తూ నామినేట్ చేయగా, అమన్ గెలిచి వర్షిణిని నామినేట్ చేశాడు. గతంలో హగ్ చేసుకున్న పాత విషయాన్ని అమన్ మళ్లీ తీసుకురావడంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది.

చరణ్ ఎలిమినేషన్ టాపిక్

తర్వాతి టాస్క్‌లో నరేష్ గెలిచి రోహిత్‌ను నామినేట్ చేశాడు. గతంలో చరణ్ ఎలిమినేషన్ సమయంలో రోహిత్ ఆడిన డబుల్ గేమ్‌ను నరేష్ బయటపెట్టాడు. చరణ్ బాగా ఆడాడని చెప్పిన రోహిత్, నామినేషన్ల నుంచి షాలినిని కాపాడుకోవడానికి చరణ్‌కు ఓటు వేయలేదని గుర్తుచేసాడు. రోహిత్ దీన్ని కవర్ చేసుకుంటూ చరణ్‌కు రీఎంట్రీ ఉందని, అందుకే షాలినికి వేశానని చెప్పడంతో హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. చరణ్ విషయంలో పాజిటివ్‌గా మాట్లాడినందుకు ఎపిసోడ్ చివర్లో షాలిని మళ్లీ రోహిత్‌తో గొడవపడటం విశేషం.

కెప్టెన్ సుధీర్ నిర్ణయం

టాస్క్ లో ఓడిపోవడంతో వర్షిణి ఇప్పటికే నామినేషన్లలో ఉండగా, ఝాన్సీ - రామ్ ప్రసాద్‌లలో ఒకరిని నామినేట్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ కెప్టెన్ సుధీర్‌కు అప్పగించాడు. సుధీర్ ఆలోచించి రామ్ ప్రసాద్ పేరును ఖరారు చేశాడు. తీవ్రమైన అరుపులు, వాదనల మధ్య ముగిసిన ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసాక, నరేష్, రామ్ ప్రసాద్ సరదాగా బురదలో ఆడుకుంటూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా ఈ వారం ఎలిమినేషన్ రేసులో వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రామ్ ప్రసాద్ నిలిచారు.

వారమంతా గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో అసలైన ఓటింగ్ రచ్చ మొదలైంది. హౌస్‌లో లొల్లితో వార్తల్లో నిలిచిన షాలిని, రోహిత్ జంటను ప్రేక్షకులు కాపాడుతారా లేక పాయింట్లతో ఆడిన మిగతా వారికి ఓట్లు వేస్తారా అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.