Sircilla: జనగణన వివరాలను పక్కాగా సేకరించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో జనగణన-2027 రెండో దశ శిక్షణ. ప్రతి వ్యక్తికి సంబంధించి 40 ప్రశ్నల వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం.
Sircilla: జనగణన వివరాలను పక్కాగా సేకరించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల జిల్లా: భారత జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన వివరాలను క్షేత్రస్థాయిలో నాణ్యతతో, కచ్చితత్వంతో సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
జనాభా గణన రెండో దశ నిర్వహణపై ఛార్జ్ ఆఫీసర్లు (తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు), అదనపు ఛార్జ్ ఆఫీసర్లు (ఎంపీడీఓలు)కు గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణన ప్రక్రియ అమలు, సిబ్బంది విధులు, బాధ్యతలు, జనాభా వివరాల సేకరణ, సమాచార నమోదు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేటర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరించి హౌస్ లిస్టింగ్ బ్లాక్‌ల ఆధునీకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. 800 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో కొత్త ఎన్యూమరేషన్ బ్లాక్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ కార్యక్రమమని, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి సంబంధించిన 40 ప్రశ్నల వివరాలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లు తమ పరిధిలోని గణన సిబ్బందికి అవసరమైన సూచనలు అందించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనగణన–2027 రెండో దశను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.




