Bachupally: సమయస్ఫూర్తితో స్పందన.. స్కూల్‌లో తప్పిన పెను ప్రమాదం!
Bachupally: బాచుపల్లి విఘ్నాన్ జ్యోతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఏసీలో చెలరేగిన మంటలను హైడ్రా 49 బృందం, జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అదుపుచేసి పెను ప్రమాదాన్ని నివారించారు.
Bachupally: సమయస్ఫూర్తితో స్పందన.. స్కూల్‌లో తప్పిన పెను ప్రమాదం!
బాచుపల్లి: బాచుపల్లి ప్రీ ప్రైమరీ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికంగా ఆందోళన కలిగించింది. లహరి గ్రీన్ పార్క్ రోడ్డులోని విఘ్నాన్ జ్యోతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏసీ స్విచ్ బోర్డును ఆన్ చేస్తున్న సమయంలో విద్యుత్ స్పార్క్ రావడంతో ఏసీలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
తొలుత పొగమంచులా పొగ వ్యాపించి, ఆ తర్వాత చిన్నపాటి మంటలు కనిపించాయి. అయితే ఘటన జరిగిన సమయంలో తరగతి గదుల్లో చిన్నారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న హైడ్రా 49 బృందం వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. చిందం సంతోష్, చెగురి సంతోష్, మునుకుంట్ల శ్రీను, ఆకుల అశోక్ సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించారు.
జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి కొద్దిసేపటికే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. హైడ్రా, ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత పెరగకుండా నివారించగలిగారు. వారి సేవలను స్థానికులు ప్రశంసించారు.




