Hyderabad: నైనీ గని నుండి రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి సీఎండీ ఆదేశం
Hyderabad: ఒడిశాలోని నైనీ గని నుంచి రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశం. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ.
Hyderabad: నైనీ గని నుండి రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి సీఎండీ ఆదేశం
హైదరాబాద్: ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణాను మరింత వేగవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నైనీ గని నుంచి తెలంగాణకు రోజుకు కనీసం 20 వేల టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
శనివారం సాయంత్రం సింగరేణి భవన్‌లో నైనీ గని పనితీరుపై సంస్థ డైరెక్టర్లు, సంబంధిత జనరల్ మేనేజర్లతో సీఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంతో పాటు అదనపు బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా గనిలో ఓవర్‌బర్డెన్ (మట్టి తొలగింపు) పనులను వేగవంతం చేయాలని, తద్వారా బొగ్గు ఉత్పత్తికి అవసరమైన ప్రాంతాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఉత్పత్తి పెంపునకు అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా పటిష్టం చేయాలని, బొగ్గు తరలింపులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
సమీక్షలో నైనీ గని జనరల్ మేనేజర్ బైద్య మాట్లాడుతూ.. ప్రస్తుతం గనిలో కొనసాగుతున్న బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్‌బర్డెన్ తొలగింపు పనుల పురోగతిని సీఎండీకి వివరించారు. బొగ్గు రవాణా నిరంతరాయంగా జరిగేలా చేపడుతున్న చర్యలను తెలియజేశారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) దేవేందర్‌తో పాటు వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.




