LB Nagar: ధర్మచక్రం గుర్తుకే ఓటేయండి: ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్
LB Nagar: ఎల్బీనగర్‌లో ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్ మీడియా సమావేశం; కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత కోసం ధర్మచక్రం గుర్తుకు ఓటేయాలని రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
LB Nagar: ధర్మచక్రం గుర్తుకే ఓటేయండి: ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు కొమిరెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా బహుజన కార్మిక యూనియన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, పనిభారం, పదోన్నతులు, ప్రమాద కేసులు, రిటైర్మెంట్ బకాయిలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు. తమ యూనియన్ గుర్తు ధర్మచక్రం కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
విలీన ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని బహుజన కార్మిక యూనియన్ అధ్యక్షుడు కొమిరెల్లి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య, కోశాధికారి బుద్ధ విశాల్ తెలిపారు. విలీనం తర్వాత కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతన ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా పోరాడతామని పేర్కొన్నారు.
టికెట్ బాధ్యత ప్రయాణికులదే..
ప్రయాణికుడు టికెట్ తీసుకోవడం, ప్రయాణం పూర్తయ్యే వరకు ఆ టికెట్‌ను భద్రపరచుకోవడం ప్రయాణికుడి బాధ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ కోరుతోంది. టికెట్ విషయంలో చిన్నపాటి తప్పిదాలకు కార్మికులను బాధ్యులను చేసి కఠిన చర్యలు తీసుకునే విధానానికి బదులు.. ప్రయాణికుల బాధ్యతను కూడా స్పష్టంగా నిర్వచించేలా నిబంధనలు ఉండాలని పేర్కొంది.
‘ రీమూవల్’ విధానానికి స్వస్తి పలకాలి
ఆర్టీసీ నియమావళిలో ఉన్న ‘రీమూవల్’ వంటి కఠిన చర్యలకు అవకాశం లేకుండా చేయడమే తమ లక్ష్యమని యూనియన్ నాయకులు తెలిపారు. చిన్నపాటి తప్పిదాలకు కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు కలగకుండా న్యాయబద్ధమైన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కోర్టు తీర్పు వచ్చేవరకు చర్యలు వద్దు
డ్రైవర్లు ప్రమాదాలకు గురైన సందర్భాల్లో.. కేసు విచారణ పూర్తికాకముందే ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా చూడాలని బహుజన కార్మిక యూనియన్ డిమాండ్ చేసింది. ప్రమాద ఘటనకు సంబంధించిన వాస్తవాలు, బాధ్యత ఎవరిదన్నది కోర్టు విచారణలో తేలే వరకు కార్మికులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా విధానం తీసుకురావాలని కోరింది.
ఇంక్రిమెంట్లు నిలిపివేయొద్దు
కార్మికుల సర్వీస్ కాలంలో ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయకుండా చూడటంతో పాటు.. ఇప్పటికే ఉన్న బేసిక్ పే నుంచి ఇంక్రిమెంట్లను తగ్గించకుండా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. కార్మికుల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలగకుండా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ
2025 వేతన సవరణను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాస్టర్ స్కేల్స్‌తో అమలు చేయించడమే తమ లక్ష్యమని యూనియన్ నాయకులు తెలిపారు. వేతన సవరణలో ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు.
"పెరిగిన పనిభారాన్ని తగ్గిస్తాం
డ్యూటీ షెడ్యూల్స్‌లో కిలోమీటర్లు పెంచుతూ కార్మికులపై అదనపు పనిభారం మోపకుండా చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఇప్పటికే పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపింది. డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి పెరగకుండా శాస్త్రీయ విధానంలో డ్యూటీ షెడ్యూల్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
రిటైర్డ్ కార్మికులకు బకాయిలు ఇప్పిస్తాం
ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లించేలా కృషి చేస్తామని బహుజన కార్మిక యూనియన్ నాయకులు హామీ ఇచ్చారు. సుదీర్ఘకాలం సంస్థకు సేవలందించిన రిటైర్డ్ కార్మికులకు వారి హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు ఆలస్యం కాకుండా చూడటమే తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
రెండు బ్యాలెట్లలోనూ ధర్మచక్రం గుర్తుకే ఓటు
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బహుజన కార్మిక యూనియన్‌కు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. క్లాజ్–3 తెల్ల బ్యాలెట్‌పై రాష్ట్ర గుర్తింపు కోసం, క్లాజ్–6 పింక్ బ్యాలెట్‌పై స్థానిక గుర్తింపు కోసం ధర్మచక్రం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, పనిభారం తగ్గింపు, రిటైర్డ్ కార్మికుల బకాయిల చెల్లింపు తదితర అంశాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బహుజన కార్మిక యూనియన్ అధ్యక్షుడు కొమిరెల్లి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య తెలిపారు. ధర్మచక్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరారు.




