Hyderabad: బ్రేక్‌ఫాస్ట్ కిచెన్లకు సింగరేణి రూ.61.44 కోట్ల నిధులు

Hyderabad: హైదరాబాద్‌లో సింగరేణి రూ.61.44 కోట్ల సీఎస్ఆర్ నిధులతో 9 సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటు; 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 27 Nov 2026 6:02 PM IST
Hyderabad
X

Hyderabad: బ్రేక్‌ఫాస్ట్ కిచెన్లకు సింగరేణి రూ.61.44 కోట్ల నిధులు

హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తితో దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థ.. ఇప్పుడు విద్యార్థుల ఆకలి తీర్చి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్ పథకానికి సింగరేణి సంస్థ భారీ ఆర్థిక సహకారం అందిస్తోంది.

ఈ పథకం అమలులో భాగంగా రూ.61.44 కోట్ల సీఎస్ఆర్ నిధులను కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో అత్యాధునిక సెంట్రలైజ్డ్ కిచెన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా పౌష్టిక అల్పాహారం అందించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే కొడంగల్, మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లు ప్రారంభమయ్యాయి. త్వరలో సింగరేణి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లా మునగాల, కాగజ్‌నగర్, భూపాలపల్లి ప్రాంతాల్లో మరో ఐదు కిచెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం

మంచిర్యాల జిల్లాలో 18 మండలాల పరిధిలోని 757 పాఠశాలలకు పౌష్టిక అల్పాహారం అందించేలా రూ.7.53 కోట్లతో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ వంటశాల ప్రారంభమై విద్యార్థులకు సేవలందిస్తోంది. అదేవిధంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 1,008 పాఠశాలలను అనుసంధానిస్తూ కాగజ్‌నగర్ కేంద్రంగా రూ.7.53 కోట్లతో మరో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

9 ప్రాంతాల్లో కిచెన్లు.. 8 వేల పాఠశాలలకు ప్రయోజనం

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వంటశాలల పరిధిలో సుమారు 8 వేల పాఠశాలలు ఉండనున్నాయి. కొత్తగూడెం పరిధిలో 1,310 పాఠశాలలకు రూ.8.75 కోట్లతో, సూర్యాపేట పరిధిలో 1,029 పాఠశాలలకు రూ.9.61 కోట్లతో వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు. మధిరలో 879 పాఠశాలలకు రూ.7.53 కోట్లతో వంటశాల ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. సింగరేణి ఖమ్మం ప్రాంతంలో 639 పాఠశాలలకు రూ.8.96 కోట్లతో మరో కిచెన్ నిర్మించనున్నారు. మంథనిలో 711 పాఠశాలలకు రూ.5.97 కోట్లతో, భూపాలపల్లిలో 229 పాఠశాలలకు రూ.3.56 కోట్లతో వంటశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

చదువుతో పాటు ఆరోగ్యానికి భరోసా

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు ఈ పథకం దోహదపడనుంది. ఆకలి కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు డ్రాపౌట్లను తగ్గించేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు పాఠశాల భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వెచ్చించిన సింగరేణి.. ఇప్పుడు విద్యార్థుల పోషకాహార అవసరాల కోసం కేంద్రీకృత వంటశాలల ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా సామాజిక బాధ్యతలో మరో ముందడుగు వేసింది. బొగ్గు గనుల నుంచి విద్యుత్ వెలుగులు అందించడమే కాకుండా.. భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ సింగరేణి తన సామాజిక బాధ్యతను చాటుకుంటోంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.