Hyderabad Metro-TGSRTC common pass: హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌లు ప్రారంభం
Hyderabad Metro-Telangana RTC common pass: హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ ప్రయాణాలకు కామన్ పాస్‌లు రానున్నాయి. అక్టోబర్ 2న ప్రారంభం కానున్న ఈ పాస్‌ల వివరాలు ఇవే.
Hyderabad Metro-TGSRTC common pass: హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌లు ప్రారంభం
Hyderabad Metro-TGSRTC common pass: హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కామన్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ సేవలను అనుసంధానం చేస్తూ ఈ జాయింట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నారు.
అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కామన్ పాస్‌ను ప్రారంభించనున్నారు. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మెట్రో, ఆర్టీసీ సేవలను కలిపి సంయుక్త ప్రయాణ పాస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, టీజీఎస్ఆర్టీసీ కలిసి కామన్ పాస్‌ను అమలు చేయనున్నాయి.
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రోజువారీ, నెలవారీ జాయింట్ పాస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రోజువారీ జాయింట్ పాస్ ధరను రూ.400గా, నెలవారీ పాస్ ధరను రూ.8,500గా నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాస్‌ల కొనుగోలు విధానం, దరఖాస్తు ప్రక్రియ, వినియోగానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అక్టోబర్ 2న జరిగే ప్రారంభ కార్యక్రమంలో అధికారులు వెల్లడించనున్నారు.
ఈ కామన్ పాస్ అందుబాటులోకి వస్తే మెట్రో స్టేషన్ నుంచి ఆర్టీసీ సిటీ బస్సులకు మారే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. వేర్వేరు టికెట్లు తీసుకునే అవసరం తగ్గడంతో ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ప్రజా రవాణా వినియోగం పెరిగే అవకాశం ఉంది. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే ప్రయాణ వ్యవస్థగా అనుసంధానం చేయడంలో ఈ కామన్ పాస్ కీలకంగా మారనుంది.




