Gajularamaram: పిల్లలను స్కూల్లో దింపి వస్తుండగా వ్యాపారి కిడ్నాప్

Gajularamaram: పిల్లలను పాఠశాలలో దింపి వస్తున్న వ్యాపారి అశోక్‌రెడ్డిని గాజులరామారంలో కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Oct 2026 8:25 PM IST
Gajularamaram
X

Gajularamaram: పిల్లలను స్కూల్లో దింపి వస్తుండగా వ్యాపారి కిడ్నాప్

కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గాజులరామారంలో ఓ వ్యాపారి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. గాజులరామారానికి చెందిన బీధల అశోక్‌రెడ్డి (37)ను ఐదుగురు వ్యక్తులు కారులో వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం ఉదయం అశోక్‌రెడ్డి తన పిల్లలను స్కూల్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అశోక్‌రెడ్డిపై దాడి చేసి బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆకృతి స్కూల్‌ డ్రైవర్‌ ఫోన్‌ ద్వారా అశోక్‌రెడ్డి భార్య స్వాతికి తెలియజేసినట్లు సమాచారం.

కాగా, వ్యాపార భాగస్వామి చంద్రశేఖర్‌తో వ్యాపార నష్టాల విషయంలో తలెత్తిన వివాదం, వేధింపులే కిడ్నాప్‌కు కారణమై ఉండొచ్చని అశోక్‌రెడ్డి భార్య స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా డబ్బులు ఇవ్వకపోతే పిల్లలను కిడ్నాప్‌ చేసి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు ఆమె ఆరోపించారు.

కిడ్నాప్‌ అనంతరం అశోక్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్వాతి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR