YS Jagan: మన సమయం వస్తుంది.. దౌర్జన్యాలను ఎదురించి నామినేషన్లు వేయండి!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పక్షం పాల్పడుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

G Krishna
Published on: 20 Oct 2026 7:49 PM IST
YS Jagan
X

YS Jagan: మన సమయం వస్తుంది.. దౌర్జన్యాలను ఎదురించి నామినేషన్లు వేయండి!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పక్షం పాల్పడుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ప్రత్యర్థుల అరాచకాలు తాత్కాలికమేనని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. "ఇప్పుడు వాళ్ల సమయం నడుస్తోంది.. మనం కాస్త ఓపిక పడదాం.. మన సమయం మళ్లీ వస్తుంది" అంటూ ఆయన పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యం నింపారు.

పులివెందుల నుంచి దర్శి వరకు.. నిలువెత్తు ప్రజాస్వామ్య ఖూనీ

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కై వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని జగన్ గట్టిగా ఆరోపించారు. ముఖ్యంగా పులివెందుల, పుంగనూరు, కడప, రాయచోటి, గుంతకల్, దర్శి తదితర నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని విమర్శించారు.

నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను భయపెట్టి బెదిరించడం, చివరికి కొందరిని కిడ్నాప్ చేసే స్థాయికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలు, ప్రజాస్వామ్య ఖూనీపై తాను స్వయంగా గవర్నర్‌ను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు.

పోలీసుల తీరుపై విమర్శలు.. వెనకడుగు వేయొద్దని శ్రేణులకు సూచన

కొందరు సీనియర్ పోలీస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్నారని జగన్ విమర్శించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం పోయిందని అన్నారు. అధికార పక్షం ఎన్ని దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడినప్పటికీ పార్టీ శ్రేణులు ఏమాత్రం భయపడకుండా, వెనక్కి తగ్గకుండా ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఈ అరాచకాలను ఎదురించి నిలబడతామని జగన్ స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.