YS Jagan: సుప్రీంకోర్టు ఆదేశాలైనా లెక్కలేదా? చంద్రబాబుపై జగన్ ఫైర్!
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
YS Jagan: సుప్రీంకోర్టు ఆదేశాలైనా లెక్కలేదా? చంద్రబాబుపై జగన్ ఫైర్!
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమాలపై దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారకపోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, ప్రతినిధులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో వైఎస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ వ్యవస్థీకృత హింస
ఈ సందర్భంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ వ్యవస్థీకృత హింసకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. "పరిపాలన అందించాల్సిన ప్రభుత్వంలో ఉన్నవారే స్వయంగా ముందస్తు వ్యూహంతో హింసకు దిగడం మన దేశంలోనే ఎక్కడా చూసి ఉండం. తమ చేతిలోని పోలీసు బలగాలను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు ఈ దారుణాలన్నింటినీ చేయిస్తున్నారు" అని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అధికార పక్షం అరాచకాలు సాగిస్తుండటం ఆందోళనకరమని అన్నారు.
పటిష్ఠ ఆధారాలతోనే న్యాయపోరాటం.. వైఎస్ జగన్ పిలుపు
కూటమి ప్రభుత్వ బెదిరింపులు, భయాందోళనలకు లొంగకుండా క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని జగన్ అభినందించారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి న్యాయపరంగా గట్టి పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతీ అక్రమానికి సంబంధించి పటిష్ఠమైన ఆధారాలను సేకరించడం అత్యంత అవసరమని, ఆ ఆధారాలన్నింటినీ న్యాయస్థానాల ముందు ఉంచి కూటమి ప్రభుత్వ అసలు రంగును బయటపెడదామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఎందాకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు.




