Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం
Srikalahasti: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ దక్షిణ గోపురం పక్కనే ఉన్న ప్రసాదాల తయారీ కేంద్రంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్వామివారికి నైవేద్యంగా, భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలతో పాటు వడలు, అన్నప్రసాదాలు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మరియు చుట్టుపక్కల మండపాల్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆలయ ఈవో వెంకటేశులు, ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతానికి ప్రసాదాల తయారీని తాత్కాలికంగా నిలిపివేసి, కేంద్రంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.




